Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల వైఫల్యం లేదా..?
- రాజకీయ ఒత్తిళ్లతోనే..
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో పదో తరగతి హిందీ పరీక్షా పత్రం లీకు విషయంలో పోలీసుల వైఫల్యం లేదా ? అనే విషయం నేడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏ పరీక్షా కేంద్రం నుండి పేపర్ బయటకు వచ్చిందో ఆ ఇన్విజిలేటర్‌ను సర్వీస్ నుండి రిమూవ్ చేయడమే కాకుండా ఛీఫ్ సూపరింటెండెంట్, మరో అధికారిని కూడా విద్యాశా ఖాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆ పరీక్షా కేంద్రానికి బందోబస్తుగా వున్న పోలీసులను, పోలీసు అధికారులపై వరంగల్ పోలీసు కమిషనర్ ఎవి రంగనాధ్ ఎందుకు చర్యలు తీసుకోలేదు ? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఒకే పరీక్షా కేంద్రం నుండి పదో తరగతి పేపర్లు లీక్ అవుతున్నప్పుడు లేదా బయటకు వస్తున్నప్పుడు ఆ కేంద్రానికి బందోబస్తు విధులను నిర్వహిస్తున్న పోలీసు అధికారుల మాటేమిటీ ? అనేది పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. పోలీసు కమిషనర్ తొ లుత ఈ విషయంపై పెద్దగా దృష్టికేంద్రీకరించలేదు. తదు పరి రోజు చాలా లోతుగా అధ్యయనం చేసి బిజెపి రాష్ట్ర అ ధ్యక్షులు బండి సంజరుని ఎ1 కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం చర్చకు దారితీసింది. అదంతా బాగానే వుంది. పదో తరగతి పరీక్షా కేంద్రం వద్ద భద్రతా వైఫల్యాలపై బా ధ్యత ఎవరిది ? అనే విషయం పోలీసు కమిషనర్ విస్మరిం చడం సమంజసం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే కాంగ్రెస్ నేత తోట పవన్‌పై జరిగిన దాడిలో అసలు దోషులను వదిలారన్న ఆరోపణలున్నాయి. బిఆర్ఎస్ కార్పొరేటర్ భర్తను అరెస్ట్ చేసిన కేసులో మరో ఇద్దరిని వదిలి పెట్టడం వెనుక ఒక అధికార ఎమ్మెల్యే హస్తమున్నదన్నది ఆ పార్టీలో బహిరంగంగానే చర్చ సాగుతుంది. ఈ వ్యవహారాల వెనుక రాజకీయ ఒత్తిళ్లు లేవా ? ఇదిలావుంటే భూకబ్జాలో పోలీసు కమిషనర్ న్యాయం చేశాడని, పాలాభిషేకం చేయడం, ఈ పాలాభిషేకం చేసిన వారిపై పలు భూకబ్జా ఫిర్యాదులన్నాయి. వారిని శిక్షించరా..?
కమలాపూర్ మండలకేంద్రంలో అదీ పోలీసు స్టేషన్ పక్కనే వున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి పదో తరగతి పరీక్షా పేపర్లు పరీక్ష జరుగుతుండగానే బయటకు వస్తున్నా, ఆ కేంద్రానికి బందోబస్తుగా వున్న పోలీసు అధికారులు ఏం చేశారు ? అన్న చర్చ సర్వత్రా జరుగుతుంది. వరంగల్ పోలీసు కమిషనర్‌గా ఎ.వి. రంగనాధ్ బాధ్యతలు స్వీకరించాక పలు పనుల్లో చురుగ్గా వ్యవహరించడం, భూ వివాదాలను పరిష్కరించడం పట్ల పాలాభిషేకాలు సైతం జరగడం చర్చకు దారితీసిన విషయం విదితమే. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షా పత్రాలు బయటకు వస్తుంటే ఆ కేంద్రం వద్ద భద్రతా విధులు నిర్వహిస్తున్న పోలీసు అధి కారుల పాత్ర ఇందులో ఏమి లేదా ? అని ప్రశ్నిస్తున్నారు. పరీక్షా కేంద్రం నుండి ఏ గదిలో నుండి హిందీ ప్రశ్నపత్రం బయటకు వచ్చిందో తెలుసుకున్న విద్యాశాఖాధికారులు ఇన్విజిలేటర్‌కు తెలిసి జరిగిందా ? తెలియక జరిగిందా ? అనే కోణంలో విచారణ జరపకుండానే సర్వీస్ నుండి రిమూవల్ చేయడం ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేగింది. పరీక్షా కేంద్రాల చుట్టు పోలీసులు విధులు నిర్వహిస్తుండగా బయటి వ్యక్తులు ఎలా వెళ్లగలిగారు ? ఎలా పరీక్షా పత్రాన్ని ఫోటో తీసుకొని రాగలిగారు ? అది రెండుసార్లు జరిగినట్లు స్వయంగా పోలీసు కమిషనర్ రంగనాధ్ చెప్పడం గమనార్హం. ఈ వైఫల్యంపై పోలీసు కమిషనర్ దృష్టి సారించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల వైఫల్యం లేదా ..?
పదో తరగతి పరీక్షలు జరుగుతున్నప్పుడు 144 సెక్షన్ విధించడంతోపాటు ప్రతి పరీక్షా కేంద్రానికి పోలీసు బందోబస్తు నిర్వహించడం, ఇన్స్పెక్టర్, ఎస్సైస్థాయి అధికారులు నిరంతరం పెట్రోలింగ్ చేయడం తెలిసిందే. కమలాపూర్ పరీక్షా కేంద్రానికి సైతం బందోబస్తులో పోలీసులున్నారు. అదేవిధంగా పోలీసు అధికారులు ఇక్కడ పెట్రోలింగ్ చేసినా పరీక్షా కేంద్రం నుండి ఒక మైనర్ పరీక్షా పత్రాలను ఫోటోలను తీసుకొని బయటకు వచ్చి సామాజిక మాధ్యమాల్లో పెడుతుండడంపై పోలీసు శాఖ నిఘా కొరవడిందన్నది బహిరంగ రహస్యమే. దీనికి పోలీసు శాఖ బాధ్యత వహించదా ? అనే విషయం పోలీసు కమిషనర్ ఎ.వి. రంగనాధే స్పష్టం చేయాల్సి వుంది.
పోలీసు అధికారులపై చర్యలుండవా..?
విద్యాశాఖ ఉన్నతాధికారులు హిందీ పరీక్షా పత్రం పరీక్ష జరుగుతుండగానే బయటకు వెళ్లడంపై సీరియస్‌గా స్పందించి సదరు ఇన్విజిలేటర్‌ను సర్వీస్ నుండి రిమూవ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరీ పోలీసు కమిషనర్ భద్రతా కల్పించడంలో వైఫల్యం చెందినందుకు పోలీసు అధికారులు, సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటీ ? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
ఆంతర్యం ఏమిటీ..?
పదో తరగతి ప్రశ్నాపత్రాలు బయటకు రావడమే కాదు.. ఇటీవల టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి హన్మకొండ నగర పర్యటనలో ఆ పార్టీ నేత తోట పవన్‌పై దాడి జరిగితే అసలు దోషులను వదిలి, ఇతరులపై కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. కొట్టిన వాడినే సాక్షిగా నమోదు చేయడం ఈ కేసులో కొసమెరుపు. ఇదిలావుంటే భూకబ్జాల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై కూడా కేసులు పెట్టామని చెబుతున్న పోలీసు కమిషనర్ తోట పవన్‌పై దాడి చేసిన ఘటనలో అసలు దోషులను ఎందుకు వదిలారో స్పష్టం చేయాల్సి వుందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ ఒత్తిళ్లు..
వరంగల్ పోలీసు కమిషనర్‌పై రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయని తోట పవన్ కేసులో స్పష్టమవుతుండగా, పలు భూ కబ్జాల్లోనూ పలువురు నేరుగా ఫిర్యాదు చేసినా స్పందించలేదని బాధితులు వాపోతున్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసు అధికారులు పనిచేస్తుండడం క్షేత్రస్థా యిలో విమర్శలకు తావిస్తుంది. ఎనుమాముల పోలీసు స్టేషన్ పరిధిలో రెండు భూ కబ్జాల కేసులకు సంబంధించి బాధితులు నేరుగా పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇందులో ఒక కేసులోనే పోలీసు కమిషనర్ స్పందించారు. ఇందులోను మాజీ కార్పొరేటర్‌తోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నా అధికార పార్టీ ఎమ్మెల్యే జోక్యంతో ఇద్దరిని వదిలేసి కేవలం మాజీ కార్పొరేటర్‌పై కేసు నమోదు చేశారని వారి అనుచరులు చెబుతున్నారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ ఒత్తిళ్లే పనిచేసినట్లు స్పష్టమవుతుంది. వరంగల్ తూర్పులో ఒక కార్పొరేటర్‌ను అదుపులోకి తీసుకుంటే నేరుగా ఎమ్మెల్యేనే వచ్చి తీసుకుపోయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లే కారణమనేది బహిరంగ రహస్యమే. ఇదిలావుంటే భూకబ్జా కేసులను పరిష్కరించినందుకు పోలీసు కమిషనర్‌కు పలువురు పాలాభిషేకం చేయడం చర్చకు దారితీసింది. ఈ పాలాభిషేకం చేసిన వారిలో పలువురిపై భూ కబ్జా ఫిర్యాదులుండడం గమనార్హం.