Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి మహాధర్నాను విజయవంతం చేయాలి
- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి
నవతెలంగాణ-భూపాలపల్లి
సింగరేణి ప్రైవేటీకరణను నిలిపివేయాల్సిందేనని, కేంద్ర బీజేపీ సర్కార్ కుట్రలను తిప్పి కొట్టాలని ఇదే క్రమం లో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. శుక్రవారం ఆమె 'నవతెలంగాణ 'తో ప్రత్యేకంగా మాట్లాడారు.. సింగరేణిని ప్రైవేటీకరించబోమని 2022 నవంబర్ 12 న రామగుం డంలో ప్రధాని ఇచ్చిన మాట తప్పారని గుర్తు చేశారు. యూ టర్న్ తీసుకున్న కేంద్ర బిజెపి ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తాజాగా సింగరేణిలోని మరోసారి బొగ్గు గనుల వేలానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ స్థాయిలో మహా ధర్నా కార్యక్రమాలను చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలిపారు. కేంద్రం కుట్రపూరితంగా గనుల వేలం ప్రక్రి యను మరోసారి తెరపైకి తీసుకువచ్చిందన్నారు. అటు సిం గరేణి కార్మికులు తెలంగాణ ప్రజలు ఏకకంఠంతో సింగరేణి కోసం ప్రత్యేకంగా గనులు కేటాయించాలని కోరినా, పట్టించుకోకుండా మరోసారి సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణ పల్లి, పెన గడప గనుల వేలం కోసం నోటిఫికేషన్ కేంద్రం ఇచ్చిం దన్నారు. మార్చి 29 నుంచి మే 30 వరకు ఈ గనులకు వేలం ప్రక్రియను నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలను బీఆర్ఎస్ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. సింగరేణికి అవసరమైన బొగ్గు గనులను నేరుగా కేటాయిం చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కూడా గనులు కేటాయించకుండా ఆ సంస్థను దివాలా తీయించిన కేంద్రం అదే విష ప్రయోగాన్ని ఇక్కడ అమలు చేయాలని చూస్తుందన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వ కుట్రలను అడ్డుకుని తీరుతామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరే షన్‌కు మాత్రం నామినేషన్ పద్ధతిన భారీగా లిగ్నైట్ గనులు కేటాయించిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారన్నారు. గుజరాత్ మాదిరిగానే తెలంగాణలోని సింగరేణికి బొగ్గు గనులను కేటాయించాలని కోరినప్పటికీ పెడచెవిన పెట్టిం దన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటలన్నీ కల్లబొల్లి మాటలేనని తేలిపోయిందని గుర్తుచేశారు. నవంబర్ 12 , 2022న రామగుండం పర్యటన సందర్భంగా సాక్షాత్తూ ప్రధాన మంత్రే.. సింగరేణి బొగ్గుగనులను ప్రైవేటీకరించం అని మాటిచ్చి నిలుపుకోలేకపోయారని గుర్తుచేశారు. ప్రధాని మరోసారి రాష్ట్రానికి రాబోతున్న తరుణంలో దానిపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. అటు ఉత్పత్తిలోనూ, లాభాల్లోనూ, పిఎల్ఎఫ్ లోనూ సరికొత్త రికార్డులు సృష్టి స్తున్న సింగరేణిని ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏమొ చ్చిందో చెప్పే దమ్ము కేంద్ర ప్రభుత్వంలోనే ఏ ఒక్కరికైనా ఉందా అని నిలదీశారు. సింగరేణి సంక్షోభంలోకి వెళితే దక్షిణ భారతదేశ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ కుప్ప కూలుతుందనే సంగతి ప్రధానికి తెలియదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న గుర్తింపు, గౌరవాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం ఓర్వలేకపోతోందన్నారు. విద్యుత్ ఉత్పత్తిని దెబ్బతీసి.. తద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజె క్టులకు కరెంట్ లేకుండా చేయాలని కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 24 గంటల పాటు ఇస్తున్న నాణ్యమైన విద్యుత్ సరఫరాను అడ్డు కోవాలనే సింగరేణిపై కక్ష కట్టిందన్నారు. రాష్ట్రంలోని దళిత, గిరిజన, కులవత్తులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ ఫలాలను గండికొట్టాలని కేంద్రం చూస్తోందన్నారు అందుకే ఉచిత పథకాలను.. అనుచితాలని స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించడం ఆయనకు పేదప్రజలపై ఉన్న కక్షపూరిత వైఖరిని వెల్లడిస్తుందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను తెలంగాణ బలంగా అడ్డుకోవడం, మోటర్లకు మీటర్లు పెట్టమని తెగేసి చెప్పడంతో కేంద్రం దొడ్డిదారిలో సింగరేణిపై కన్నేసిందని మండిపడ్డారు. సింగరేణి ప్రైవేటీకరణ పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే జంగ్ సైరన్ మోగిస్తామని అన్నారు. మరో ప్రజా ఉద్యమం నిర్మిస్తామని హెచ్చరించారు. సింగరేణి ప్రయివేటు పరం అయితే సింగరేణి కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారని, వారసత్వ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, నియామకాలలో రిజర్వేషన్లు, వారికిచ్చే బోనసులు, అలవెన్స్‌లు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా రద్దు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రలపైన ఉద్యోగులు, కార్మికుల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని, వారికి బీఆర్ఎస్ అండగా ఉంటున్నదని గుర్తుచేశారు. నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోడీ రాకను నిరసిస్తూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా నేడు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో జరిగే మహా ధర్నాకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారన్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు బీఆర్ఎస్ నాయ కులు, కర్షకులు, మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.