Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మారనున్న వనపర్తి రూపురేఖలు
- నాలుగు లైన్లతో విశాలమైన రోడ్లు
- పనుల్లో వేగం పెంచిన అధికారులు
- మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశం
''వనపర్తి జిల్లా కేంద్రం ఒక సమస్యల పుట్ట. అందులోనూ పట్టణంలోని రోడ్లంతా గతుకులమయం. మెయిన్ రోడ్ల నుంచి గల్లీల రోడ్ల వరకు ఇదే పరిస్థితి. వాహనాలపై ప్రయాణమంటేనే జంకాల్సిన పరిస్థితి.
నవ తెలంగాణ- వనపర్తి
''వనపర్తి జిల్లా కేంద్రం ఒక సమస్యల పుట్ట. అందులోనూ పట్టణంలోని రోడ్లంతా గతుకులమయం. మెయిన్ రోడ్ల నుంచి గల్లీల రోడ్ల వరకు ఇదే పరిస్థితి. వాహనాలపై ప్రయాణమంటేనే జంకాల్సిన పరిస్థితి. ఇదీ నిన్నటి, మొన్నటి వరకు ఉన్న ప్రధాన సమస్య. కానీ ఈ యేడాది జిల్లా కేంద్రంలో నాలుగులైన్ల రోడ్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులివ్వడంతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విశాలైన రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరవ్వడంతో పనులు ప్రారంభమై ఏడు నెలలు గడుస్తోంది. రోడ్లు విశాలం అవుతుండటంతో పట్టణ వాసుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ఇకపై ప్రయాణం ఎంతో సులువు కానుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.''
ఆరు కిలోమీటర్లు విశాలమైన రోడ్లు
వనపర్తి పట్టణంలో గతంలో రెండులైన్ల రోడ్లు ఉండేవి. ప్రస్తుతం నాలుగు లైన్ల రోడ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.49.7 కోట్ల నిధులు కేటాయించింది. దీంతో విస్తీర్ణం పనులు కొనసాగుతున్నాయి. 2022 ఫిబ్రవరిలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు మరో మూడు నాలుగు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల నుంచి మొదలుకొని కర్నూల్ రోడ్డులోని ఎల్ఐసీ కార్యాలయం వరకు కిలోమీటరు, పాలిటెక్నిక్ కళాశాల నుంచి గోపాల్పేట రోడ్డులోని విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం వరకు మూడు కిలోమీటర్లు, చిట్యాల రోడ్డులోని శ్రీచైతన్య పాఠశాల వరకు కిలోమీటరు, అంబేద్కర్ చౌరస్తా నుంచి పాన్గల్ రోడ్డులోని చౌడేశ్వరీదేవి ఆలయం వరకు కిలోమీటరు మేర పనులు చేపట్టాల్సి ఉంది.
కొనసాగుతున్న పనులు
జిల్లా కేంద్రంలో ఇప్పటికే గోపాల్పేట రోడ్డులోని విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం నుంచి హరిజనవాడ పెట్రోల్ పంపు వరకు నాలుగు లైన్ల రోడ్డు పనులు పూర్తయ్యాయి. అక్కడి నుంచి గాంధీ చౌక్ మీదుగా రామాటాకీస్ వరకు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. రామాటాకీస్ బ్రిడ్జి నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా వేంకటేశ్వర స్వామి దేవాలయం వరకు మొదటి, రెండో లేయర్ పనులు పూర్తయ్యాయి. వేంకటేశ్వరస్వామి దేవాలయం నుంచి రాజీవ్ చౌరస్తా వరకు నిర్మాణాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. అలాగే అంబేద్కర్ చౌరస్తా నుంచి పాన్గల్ రోడ్డులోని చౌడేశ్వరీదేవి ఆలయం వరకు పనులు ప్రారంభమయ్యాయి. ఎస్పీ కార్యాలయం నుంచి ఫరీద్ మిల్లు వరకు నిర్మాణాల కూల్చివేత పనులు ప్రారంభం కావాల్సి ఉంది. పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఎల్ఐసీ కార్యాలయం వరకు పనులు ప్రారంభం కాలేదు.
రూ.22 కోట్లతో బ్రిడ్జీల నిర్మాణం
వనపర్తి-గోపాల్పేట మార్గంలో ప్రధానంగా జేరిపోతులవాగు, పట్టణంలోని రామాటాకీస్ దగ్గర ఉన్న పెద్దవాగుపై వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం రూ.22 కోట్లు మంజూరు చేసింది. జేరిపోతులవాగు ఉధృతంగా ప్రవాహిస్తే రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగేది. గతంలో అక్కడే ఇద్దరు వ్యక్తులు వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది.ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల రోడ్డు విస్తరణకు అనుగుణంగా ఐదు స్లాబులతో కూడిన బిడ్జ్రి నిర్మాణంలో ఉంది. ఇప్పటికే నాలుగు స్లాబులు పూర్తయ్యాయి. మరో స్లాబు వారం రోజుల్లో పూర్తి కానుంది. చిట్యాల రోడ్డులోని వంతెన నిర్మాణం ఒకపైపు పూర్తి అయ్యింది. మరోవైపు చేపట్టాల్సి ఉంది. రామాటాకీస్ దగ్గర వాగుపై వంతెన నిర్మాణం పనులు ప్రారంభం కావాల్సి ఉంది.
రోడ్డు వెడల్పు చేపట్టనున్న పనుల వివరాలు
- పాలిటెక్నిక్ కళాశాల నుంచి బిజినేపల్లి రోడ్డు వరకు 3 కిలో మీటర్లు
- పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఎల్ఐసీ కార్యాలయం వరకు కిలో మీటరు
- అంబేద్కర్ చౌరస్తా నుంచి చౌడేశ్వరీదేవి దేవాలయం వరకు కిలో మీటరు
- గాంధీచౌక్ నుంచి శ్రీచైతన్య పాఠశాల వరకు కిలో మీటరు
మూడు నెలల్లో పూర్తి చేస్తాం...
వనపర్తి పట్టణంలో చేపడుతున్న రోడ్ల విస్తరణ పనులు దాదాపు ఇతర పనులను మున్సిపల్ అధి కారులు పూర్తి చేసివ్వాలి. రోడ్డు నిర్మాణానికి క్లియరెన్స్ ఇచ్చిన ప్రాంతాల్లో మొదటి, రెండు లేయర్ల పనులు కొన్నిచోట్ల పూర్తి చేశాం. గాంధీచౌక్ నుంచి పనులు నడుస్తున్నాయి. విద్యుత్ కార్యాలయం నుంచి కొంత పూర్తి చేశాం. పాన్గల్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. కర్నూల్ రోడ్డు పనులు ప్రారంభించలేదు. మరో మూడు నెలల్లో రోడ్డు పనులన్నీ పూర్తి చేస్తాం. రామాటాకీస్ బ్రిడ్జి నిర్మాణాన్ని రోడ్డు నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాక, పైనుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని మళ్లించి పనులు చేపట్టాల్సి ఉంది.
- ఎ.దానయ్య, డీఈఈ, ఆర్అండ్బి, వనపర్తి.