Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- ఘణపురం బ్రాంచ్ కెనాల్ ప్రారంభం
- 25 వేల ఎకరాలకు సాగునీరు విడుదల
వనపర్తి : రాష్ట్రంలోని రైతులకు తెచ్చిన పథకాల రూపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం ప్రతిరోజూ ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సంధర్భంగా 25 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఘణపురం బ్రాంచ్ కెనాల్ 14 కిలోమీటర్ వద్ద వయోడెక్ట్ పనులు పూర్తి చేసి షాపూర్, మానాజీపేట, కందూరు, ఉప్పరిపల్లి, అడ్డాకులకు సాగునీరు అందించే కాలువకు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి శుక్రవారం పూజలు చేశారు. కేసీఆర్ పుట్టిన రోజు సంధర్భంగా రైతులతో కలిసి కేక్ కట్ చేసి, స్వయంగా వడ్డించి, రైతులతో కలిసి అక్కడే భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు కష్టంలో లీనమై , రైతు కష్టం నుంచి బయట పడేందుకు గొప్ప గొప్ప పథకాలు తెచ్చిన నాయకుడు దేశంలో ఎవరూ లేరని చెప్పారు. తాగే నీళ్లలో, పొలాలాలో పారే నీళ్లలో, పండే పంటలో, ధాన్యం కల్లాలలో పంటను అమ్మితే ఖాతాలో పడే డబ్బులో కేసీఆర్ ను చూస్తున్నారన్నారు. ప్రతి పథకం, ప్రతి పని, ప్రతి ఫలితంలో కేసీఆర్ కనిపిస్తారన్నారు. కొందరిపుట్టుక చరిత్రలో శాశ్వతంగా నిలబడు తుందన్నారు. పట్టుబట్టి అసాధ్యమన్న తెలంగాణను కేసీఆర్ సుసాధ్యం చేశారన్నారు. వనపర్తి సాగునీళ్ల కోసం ఎంతో కష్టపడ్డాం.. ముఖ్యమంత్రిని ఒప్పించి, మెప్పించి సాగునీళ్లు తీసుకొచ్చామని తెలిపారు. పెద్దమందడి, ఘణపురం కాల్వల ద్వారా 75 వేల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. 25 టీఎంసీల కేటాయింపును 40 టీఎంసీలకు పెంచి సాగునీటిని సాధించామన్నారు. పండే పంటను, పారే నీళ్లను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. వనపర్తి ప్రాంతానికి సాగు నీళ్లు సాధించేందుకు సహకరించిన అందరికీ మంత్రి నిరంజన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఘనపూర్ బీఆర్ఎస్ మండల నాయకులు, సాగునీటిపారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.