Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ మొదటి మహాసభలు
- సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు
నవ తెలంగాణ -వనపర్తి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసరాల ధరలను తగ్గించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ మొదటి మహాసభ సీఐటీయూ జిల్లా కార్యాలయంలో కష్ణమాచారి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ మహాసభల ప్రారంభ సూచికగా సంఘం అధ్యక్షులు కృష్ణమాచారి జెండా ఆవిష్కరణ చేసి సభను ప్రారంభించారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా యూనియన్ గౌరవాధ్యక్షులు, సిఐటియు వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు ప్రసంగించారు. వంద రోజుల్లో ధరలు తగ్గిస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చి రూ:. 63 రూపాయలు ఉన్న పెట్రోల్ 111 రూపాయలకు పెంచారన్నారు. రూ.45 ఉన్న డీజిల్ వంద రూపాయలకు పెంచారన్నారు. రూ.450 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ రూ.1200లకు పెంచిందని, 75 రూపాయల మంచి నూనె నేడు రూ. 200 లకు దూసుకెళ్లిందని ఘాటుగా విమర్శించారు. అన్ని రకాల ధరలు విపరీతంగా పెంచిందని చెప్పారు. కింది తరగతి కార్మికులకు రోజు కూలీ రూ.200 లకు తగ్గిందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం జీవో తేవడం అన్యాయమన్నారు. పేదల పైన జీఎస్టీ పేరుతో విపరీతమైన భారాలు పెంచుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సమస్యలకు కార్పొరేట్ టాక్స్ 11 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిందన్నారు. రూ.63 వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు పాత బాకీలు మాఫీ చేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఇతర అసంఘటిత కార్మికులందరికీ నెలకు రూ.10 వేలు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హమాలీలకు సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేసి రూల్స్ రూపొందించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. సిఐటియు వనపర్తి జిల్లా మూడో మహాసభలు కొత్తకోటలో నవంబర్ 24, 25 తేదీల్లో జరగబోతున్నాయని తెలిపారు. ఈ మహాసభలను విజయవంతం చేసేందుకు కార్మిక వర్గం అంతా ఐక్యంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. నూతన కమిటీ ఎన్నిక ఉంటుందని కార్మికులు అధిక సంఖ్యలో నవంబర్ 25న జరిగే బహిరంగ సభలో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
భవన నిర్మాణం, హమాలీల సమస్యలు పరిష్కరించాలి
నవ తెలంగాణ- వనపర్తి
రాష్ట్రంలో పని చేస్తున్న భవన నిర్మాణం, హమాలీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు డిమాండ్ చేశారు. రేవల్లి మండలం చెన్నారం గ్రామంలో చెన్నారం భవన నిర్మాణ కార్మిక సంఘం, చెన్నారం హమాలీ యూనియన్ల మొదటి మహాసభ శ్రీనివాసులు, బాల చిన్నయ్య అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ మహాసభకు సిఐటియు వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని, 130 ఏళ్ల నాడు సాధించుకున్న హక్కులను ఈ రోజు తొలగించడం సరైన పద్దతి కాదని విమర్శించారు. ఎనిమిది గంటల పనిధినాన్ని 12 గంటలకు మారుస్తుందన్నారు. సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, వేతనాలు పెంచుకునే హక్కు తదితర సమస్యలను సష్టిస్తోందని విమర్శించారు. సామాన్యులను కొట్టి, ధనవంతులకు దేశ సంపదలు దోచిపెడుతుందని విమర్శించారు. ఆదాని సంపద రోజుకు రూ.1612 కోట్లు ఉండగా, ఈ దేశాన్ని కేంద్రం దోచిపెడుతుందన్నారు. నేషనల్ మానిటైజేషన్ పైపులైను పేరుతో ఆరు లక్షల కోట్ల రూపాయలకు రైల్వే స్టేషన్లను, రైళ్లను, విమానాలను, రోడ్లను, పోర్టులను, ఎల్ఐసి, బ్యాంక్స్ తదితర ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటిని కారు చౌకగా కట్టబెడుతుందని విమర్శించారు. మతం పేరుతో మారణహౌమం సష్టిస్తూ మతోన్మాదాన్ని పెంచుతూ రాజకీయం చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో లోపం ఉందన్నారు. వీఆర్ఏలకు వేతనాలు నేటికి పెంచలేదన్నారు. హమాలీలు ఇతర అసంఘటిత కార్మికులకు భవన నిర్మాణ కార్మికుల వలె వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేశామని ప్రకటించి నేటికీ రూల్స్ రూపొందించకుండా అమల్లోకి తేలేదన్నారు. హమాలీలకు ఇతర అసంఘటిత కార్మికులకు వెంటనే వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేయాలని, గుర్తింపు కార్డు ఇచ్చి సంక్షేమ పథకాల అమలు చేయాలన్నారు. సిఐటియు వనపర్తి జిల్లా మూడో మహాసభలు కొత్తకోటలో నవంబర్ 24, 25 తేదీల్లో జరగబోతున్నాయన్నారు. నవంబర్ 25న జరిగే బహిరంగ సభకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ మహాసభల్లో భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి జే.రాములు, నాయకులు బి నరసింహ, రాజు, గిరి, ఆంజనేయులు, హమాలీ సంఘం ప్రధాన కార్యదర్శి సుల్తాన్, తదితరులు పాల్గొన్నారు.