Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - వనపర్తి రూరల్
రైతులు ఆయిల్ పామ్ పంటసాగు మెలకువలపై అవగాహన కల్పించేందుకు రైతు విజ్ఞాన యాత్ర ఉపయోగపడుతుందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సురేష్ సూచించారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆశ్వారావుపేట, అప్పారావుపేటలోని ఆయిల్ పామ్ నర్సరీలు, తోటలు, తెలంగాణ రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తి దారుల సహకార సమాఖ్య కంపెనీని ఏఓలు, ఏఈఓలు, జిల్లా అధికారులు సందర్శించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడత విజ్ఞాన యాత్రలో భాగంగా ఫ్రీ యూనిక్ ఆయిల్ పామ్ కంపెనీ, జిల్లా ఉద్యాన శాఖ అధ్యర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి వనపర్తి జిల్లా నుండి 34 మంది రైతులు, వ్యవసాయ అధికారులు, ఉద్యానశాఖ అధికారులు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన పొందినట్లు ఆయన తెలిపారు. వివిధ దశలలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతుల తోటలని సందర్శించి, సాగు వివరాలు అడిగి తెలుసు కోనున్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయ సాగులోని మెళకువలు తెలుసుకొని, ఆధునిక సాంకేతికతతో అధిక దిగుబడి పొందేందుకు ఈ విజ్ఞాన యాత్ర ఉపయుక్తంగా ఉంటుందని ఆయన అన్నారు. వనపర్తి జిల్లాలో 3 వేల ఎకరాలు ఆయిల్ పామ్ సాగు చేసేందుకు లక్ష్యంగా నిర్దేశించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 718 మంది రైతులు, 2,528 ఎకరాలకు తమ వాటా మొత్తాన్ని చెల్లించటం జరిగిందని ఆయన సూచించారు. ఇందులో 520 మంది రైతులు, 2 వేల ఎకరాల్లో డ్రిప్ సౌకర్యం ద్వారా ఆయిల్ పామ్ తోటలను సాగు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నదని ఆయన సూచించారు. ఆయిల్ పామ్ సాగుతో పాటు అంతర పంటలను సాగు చేయవచ్చునని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చునని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ ఏఓలు, ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.