Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వనపర్తి : అసెంబ్లీ సమావేశాలలో వాల్మీకులను ఎస్టీలో చేర్చేందుకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతుగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి పట్టణం మర్రికుంటలో 29వ రోజులుగా వాల్మీకులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షా శిబిరాన్ని మంత్రి సందర్శించి వారితో మాట్లాడారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే విషయంలో మొదటి నుండి సహకరిస్తున్నది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మంత్రి తెలిపారు. రాజకీయ ప్రయోజనాలు మిగతా పార్టీలకు ఈ విషయంలో ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు. వాల్మీకుల సమస్యలపై చెల్లప్ప కమీషన్ ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ పార్టీయేనన్నారు. ప్రభుత్వపరంగా ఎస్టీల్లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున చేయాల్సిన అన్ని ప్రక్రియలను పూర్తిచేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల సవరణ, ఎస్టీ జాబితాలో చేర్చడం విషయంలో దురుద్దేశంతో కొర్రీలు పెడుతున్నదని మంత్రి తెలిపారు. ఎస్టీలలో చేర్చాలని డిమాండ్ చేస్తున్న వాల్మీకి సోదరులు దీనిని గమనించి దీక్షలు విరమించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి బోయల స్టీరింగ్ కమిటీ సభ్యులు, రాష్ట్ర కన్జూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, వేణుగోపాల్, మండ్ల దేవన్న నాయుడు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, ఉమ్మల్ల రాములు, కావలి బాలస్వామి నాయుడు, రఘుపతి నాయుడు, నీల స్వామి, విలేకరి సాయిరాం, గద్వాల నాయకులు నారాయణరెడ్డి, మద్దిలేటి, నాగవరం రామస్వామి, బాలరాజు, వెంకటయ్య వాల్మీకి నాయకులు పాల్గొన్నారు.