Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందుకు సాగని చదువులు
- పాఠశాలకు వెళ్లడానికి జంకుతున్న విద్యార్థులు
నవ తెలంగాణ- ఊట్కూర్
ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యం కల్పించి విద్య బోధనలు సాగిస్తున్నామని చెబుతున్న మరోపక్క పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల భర్తీ చేయడంలో విఫలమవుతుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో చదువులు ముందుకు సాగడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు వాపోతున్నారు. మండలంలోని జిల్లా పరిషత్ఉన్నత ఉర్దూమీడియం పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత కొనసాగుతుంది. దీంతో విద్యార్థులు చదువుల్లో వెనుకబడిపోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పిల్లలుబడికి వెళ్లాలని కుటుంబ సభ్యులు చెబుతున్న పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతతో సిలబస్ పూర్తి కాకపోవడం ఇబ్బందికరంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
నలుగురు ఉపాధ్యాయులే దిక్కు..
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియంలో విద్యార్థులు 19మంది ఉన్నారు. 8మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా కేవలం నాలుగురే ఉపాధ్యాయులతో పాఠశాల కొనసాగుతుంది. దీంతో ఉన్న ఉపాధ్యాయులే 8మంది ఉపాధ్యాయుల సమానంగా పనిచేసే పరిస్థితి ఏర్పడింది. ఇంగ్లీష్ ఉర్దూ, సైన్స్, తెలుగు ఉపాధ్యాయులు పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు తమ పిల్లల చదువు ఎలా ముందుకు సాగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కొన్నినెలల్లో పదోతరగతి పరీక్షలు వస్తున్నాయి. దీంతో పదోతరగతిలో తమ పిల్లలు ఎలా చదువులో ముందుకు వెళ్తారని ప్రశ్నిస్తున్నారు? ఉపాధ్యాయుల కొరత విషయం సంబంధిత విద్యాశాఖ జిల్లా మండల అధికారులకు తెలియజేసిన ఫలితం లేకుండా పోయిందని విమర్శిస్తున్నారు. గత ఐదురోజుల క్రితం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో పాఠశాల చైర్మన్ వాహిద్ హుస్సేన్ వినతిపత్రం అందజేసిన వీటిపై నేటి వరకు ఎలాంటి స్పందన కనిపించడం లేదని చైర్మన్ పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత విద్యాశాఖ జిల్లా అధికారులు స్పందించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులలో డిప్యూటీషన్పై ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పాఠశాల భవనానికి కనిపించని బోర్డు
ఉర్దూమీడియం జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల ప్రస్తుతం కొనసాగుతున్న పాఠశాల భవనానికి పాఠశాల పేరు కరువైపోయి భవనమే దర్శనమిస్తుంది. కానీ భవనంపై జిల్లా పరిషత్ఉన్నత పాఠశాల ఉర్దూమీడియం అనే పేరు దర్శనమిస్తుంది. విద్యాశాఖ జిల్లా మండలస్థాయి కాంప్లెక్స్ స్థాయి అధికారులు ఉర్దూమీడియం పాఠశాలకు వస్తున్నారేతప్ప భవనంపై పాఠశాల పేరు ఉందా లేదా అని దృష్టి పెట్టకపోవడం కోసం మెరుపు.
ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
ఉర్దూ మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
-కాంప్లెక్స్హెచ్ఎం సురేష్
ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలి
ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల కారణంగా విద్యార్థులకు చదువుల్లో ఇబ్బందికరంగా మారింది. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల భర్తీచేయిం చాలని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వినతిపత్రం అందజేశాం. వెంటనే ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నాం.
- వహేద్ హుస్సేన్, పాఠశాల చైర్మన్