Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగర్‌కర్నూల్ టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
సంపాదన కాదు సర్వీసు ముఖ్యం.. ప్రజల నిర్ణయమెరకే ఎన్నికల్లో పోటీ చేస్తా. మా నాన్నగారు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన సేవలే నేటికీ ఆనవాళ్లుగా ఉన్నాయి. మనలను నమ్ముకున్న ప్రజలకు వెన్నంటి ఉండడమే జీవిత ఆశయంగా పెట్టుకున్నామని ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి కుమారుడు డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. తన రాజకీయ భవిష్యత్తు సేవా తపన తదితర అంశాలను నవ తెలంగాణతో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే మా కుటుంబము ఈ నియోజకవర్గ ప్రజల కోసం చేసిన సేవ అందరికీ తెలుసు. సొంత ఆస్తులను అమ్ముకొని ప్రజాసేవ చేసిన నేపథ్యం మాకుంది. నేను 1999 నుండి రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నాను.గతంలో ఎలక్షన్ వరకే రాజకీయ పార్టీల ప్రచారం ఉండేది. ఎన్నికల తర్వాత స్నేహపూర్వకంగా అన్ని పార్టీల కు చెందిన నాయకులు ప్రజలు కలిసి మెలిసి ఉండేవారు. ఇప్పుడు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ఆందోళన కలిగిస్తుంది. ఎమ్మెల్యే కు చెందిన మనుషులా ఎమ్మెల్సీ మనుషులా... అని అడిగి కేసులు పెట్టే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నాయకుల దగ్గరకు రావాలంటేనే ప్రజలు బెదిరిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలోనూ ఎమ్మెల్యే తన మార్కును చూపిస్తున్నారు. ప్రజలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారు. ప్రస్తుతం యువతలో మార్పురావాలి. విద్యావంతులు రాజకీయాలను పరిశీలించి ముందుకెళ్లాలి. స్నేహపూర్వక రాజకీయాలు రావాలి. ప్రజాసేవ ఉచిత సేవలో ఉన్న ఆనందం మరెందులో ఉండదు. తెలకపల్లి మండలం పర్వతాపూర్ లో ఒక పాత బావిని 200 ట్రాక్టర్లకు పైగా మట్టిని కొట్టి పూడ్చి వేశాము. మా సొంత డబ్బులతోనే ఇదంతా చేశాము. మాకు చేతనైనంత పని ఎవరడిగినా సహకరిస్తాము. 90 శాతం పనులు ఈ నియోజకవర్గంలో మా నాన్న చేసినవే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నేను నియోజకవర్గంలో తిరుగుతుంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. సొంత డబ్బులతో వట్టెంలో 15 బోర్ బావులు మా నాన్న తవ్వించారు. ప్రజలకు దగ్గర కావాలి ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చామన్న విధానానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. మనకోసం ఉన్న వారి కోసం మనం పని చేయాలి. సంక్షేమ పథకాల అమలతోపాటు మానవీయ కోణంలో మా నాన్న సర్వీసును నేను కొనసాగిస్తాను. తాడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల కోసం ఇచ్చాము. పూడుకుర్తి లో ఎల్వి ప్రసాద్ కంటి ఆస్పత్రి కోసం మా సొంత భూమి 10 ఎకరాలు ఉచితంగా ఇచ్చాము. కూచుకుల్ల కొండమ్మ పేరుతో తూడుకుర్తిలో మినీ ఫంక్షన్ హాల్ నిర్మించాము. ఇందులో పేదలు బడుగు బలహీన వర్గాల వారు ఉచితంగా శుభకార్యాలు చేసుకుంటున్నారు. భాగ్యనగర్ అనే గ్రామాన్ని మా అమ్మ పేరు మీద నిర్మించి మౌలిక వసతులు ఏర్పాటు చేశాం. పేదలకు ఎంతో మందికి ఫీజులు చెల్లిస్తే ఇప్పుడు డాక్టర్లు ఎస్సైలు డి.ఎస్.పి స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డిగ్రీ కళాశాలను ఇక్కడికి వచ్చేలా చేశారు. సొంత ఆస్తులు నమ్మి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు తప్ప ఏనాడు అవినీతికర పనులు చేయలేదు. నేను డాక్టర్‌గా ఈ ప్రాంతం నుండి ఎవరొచ్చినా ఉచిత వైద్యాన్ని నిర్వహిస్తున్నాను. ఇప్పటివరకు నాన్న అనేక రకాల సేవలు చేశారు. వారు మా కుటుంబం నుండి ఎవరైనా రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. అందుకే ఇకనుండి వైద్యవృత్తి చేసుకుంటూనే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తాను. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేస్తాను. నాన్న మంచితనం సేవా దక్పథం గుర్తించి అధిష్టానం మాకు ఈసారి అవకాశం కల్పిస్తుందని ఆశిస్తున్నాం.