Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాయిని యాదగిరి
నవతెలంగాణ-గజ్వేల్
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గజ్వేల్‌లో కరోనా ఐసోలేషన్ సెంటర్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాయిని యాదగిరి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సమీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా ప్రభావం అంతగా లేదని చీఫ్ సెక్రటరీతో చెప్పించడం నిజంగా సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోనే గత నెల రోజుల్లో దాదాపు 10 నుంచి 20 మంది కరోనా కాటుకు బలయ్యారని తెలిపారు. వీరిని కనీసం పరామర్శించిన నాథుడే లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక కరోనా బారిన పడిన వారు ఆక్సిజన్, సరిపడా బెడ్లు లేక చనిపోతుంటే చనిపోయిన వారి దహనకాండకు వెయ్యి టన్నుల కలపను ఉచితంగా ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం వీరి అరాచక పాలనకు నిదర్శనమన్నారు. తన మాట కాదన్న నాయకులపై కక్ష సాధింపు చర్యలకు ఉన్న సమయం కరోనా బాధితుల క్షేమ కోసం కేటాయించకపోవడం అన్యాయమని తెలిపారు. గజ్వేల్‌లోని జిల్లా ఆస్పత్రిలో రోజుకు 100 మందికి వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉండగా అరవైకి తగ్గించారని, అందులో కూడా గురువారం 40 మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చి మిగతా వారందరినీ వెనక్కి పంపారని వివరించారు. రెండో డోస్ తీసుకున్న వారు కూడా వ్యాక్సిన్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఇబ్బందులకు గురి చేయడం దారుణమన్నారు. తక్షణమే గజ్వేల్‌లో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు వ్యాక్సిన్ కోసం వచ్చిన 45 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలని డిమాండ్ చేశారు. కరోనా బాధితులకు వైద్యం అందించడం కోసం గజ్వేల్‌లోని గర్ల్స్ అండ్ బార్సు ఎడ్యుకేషన్ హబ్‌లోని హాస్టల్, అలాగే పాలిటెక్నిక్ హాస్టల్లో వందల సంఖ్యలో ఉన్న బెడ్లను ఐసోలేషన్ సెంటర్‌కు ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండలాధ్యక్షులు మల్లారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకుల మొన్నగారి రాజు సురేష్, మైనార్టీ మండల ప్రెసిడెంట్ మహ్మద్ అజ్గర్‌తో పాటు లీవన్ కర్ణాకర్ తదితరులు ఉన్నారు.