Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిండని చెరువులు, కుంటలు
- పారని వాగులు, వంకలు
నవతెలంగాణ-నంగునూరు
ఖరీఫ్ సీజన్ గట్టెక్కాలంటే వ్యవసాయానికి అనుకూలంగా ఉండే చెరువులు, కుంటలు నిండాలి. ఇటీవల వారం రోజులపాటు కురిసిన వర్షం సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండల వర్షపాతం తక్కువగా నమోదైంది. అక్కనపెల్లి పెద్దవాగు పారితే 18 కిలోమీటర్ల ఆయకట్టు రైతులకు అనుకూలంగా ఉంటుంది. వాగు రెండు పక్కల రైతులకు ఎక్కువ వ్యవసాయం చేయటానికి అనుకూలంగా ఉంటుంది. పెద్దవాగుపై ఖాతా, జాలపల్లి, ఘనపూర్, నంగునూరు, అక్కెనపల్లి తదితర గ్రామ శివారులో దాదాపు పది చెక్ డ్యాములు నిర్మించారు. ఏ చెక్ డ్యామ్‌లోను నీరు నిండి పారేంత రాలేదు. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి మద్దూరు మండలం దూల్మిట గుండా ఖాతా చెక్ డ్యాం నిండితేనే మిగతా గ్రామాల్లో నిర్మించిన చెక్ డ్యామ్‌లోకి నీరు చేరుతుంది. ఇవన్నీ పూర్తిగా నిండి పారితేనే పెద్ద వాగు నిండు కుండాల మారి ప్రవహిస్తుంది. ఇతర ప్రాంతాల్లో వర్షాలు బాగా కురిసినప్పటికీ ఈ ప్రాంతంలో సరైన వర్షాలు లేక రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. మండలంలో వివిధ గ్రామాల్లో ఉన్న చెరువుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. వారం రోజులపాటు వర్షం కురిసినప్పటికీ చెరువులు, వాగులు, వంకలు ఎక్కడ పూర్తిగా నిండలేదని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. దీంతో రైతులు ఈ సీజన్ ఎట్లా గట్టెక్కేదని వేచి చూస్తున్నారు. ఆదివారం సైతం ఉరుములు, మెరుపులు కూడిన వర్షం పడినప్పటికీ ఎక్కడ చెరువులు నిండలేదు. రాబోయే రోజుల్లో పూర్తిస్థాయిగా వర్షాలు కురిస్తేనే వానకాలంలో వేసిన పంటలు పండుతాయని రైతులు వేచి చూస్తున్నారు.