Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షాకాలంలో లక్ట్రానిక్ వస్తువుల వినియోగంపై అజాగ్రత్త వద్దు
నవతెలంగాణ-నంగునూరు
కాలానుగుణంగా మన ఆరోగ్యం గురించి అనేక జాగ్రత్తలు పాటిస్తాం. ఆయా కాలాలకు అనుగుణంగా దుస్తులతో పాటు ఆహార పదార్థాల మెనూ కూడా మార్చుకుంటాం. వర్షాకాలంలో వ్యాధులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. వీటితో పాటు ప్రస్తుత వానాకాలంలో మన నిత్య జీవనంలో భాగంగా వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వస్తువులను అంతే జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకంపై చిన్నపాటి మెలుకువలు తెలుసుకుంటే అవి ఎంతో మన్నికగా ఉంటాయి. లేకుంటే వాటి మన్నిక తగ్గడానికి, అసలు పనికిరాకుండా పోవడానికి మనమే కారణమవుతాం. ఈ విషయాన్ని తెలుసుకుంటే ఎలక్ట్రానిక్ వస్తువులు మరింతకాలం మన్నికగా ఉండే వీలుంది. సెల్‌ఫోన్, టీవీ, రీఫ్రిజిరేటర్, కెమెరా, ల్యాప్‌టాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఫ్రిజ్‌ల ఉపయోగం ఎండాకాలంలోనే ఎక్కువగా ఉంటుందనుకుంటే పొరపాటే. కొంతమంది వర్షాకాలం, శీతాకాలంలో వాటిని వినియోగించకుండా ఆపేస్తారు. ఈ కాలంలో కూడా వాటిని వాడితే మంచిది. ఎలాగంటారా? నిరుపయోగంగా పెట్టడం వల్ల విద్యుత్ బిల్లుల ఆదా ఏమోగానీ అవి త్వరగా రిపేర్‌కు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఫ్రిజ్‌లోని పైపులు పూడుకుపోయే ప్రమాదం ఉంది. గ్యాస్‌ఫిల్లింగ్ కూడా చేయాల్సి వస్తుంది. వానాకాలం, చలికాలం అంతా ఫ్రిజ్ ఉపయోగించని వారు కనీసం వారానికి ఒకరోజైనా వాడితే మేలు. అలాకాకుంటే రోజు, ఉదయం, సాయంత్రం కనీసం రెండు గంటలైనా ఉపయోగిస్తే మన్నికగా ఉంటాయి. ఎండాకాలంలో హైబటన్ ఎక్కువగా ఉపయోగిస్తారు. వర్షాకాలం, చలికాలాల్లో బటన్ పెడితే చాలు.
మొబైల్ తడిస్తే అంతే..
మనిషి జీవితంలో మొబైల్ ఒక భాగమైపోయింది. వర్షాకాలంలో దీని వాడకాన్ని మెలుకువలు పాటిస్తే ఎలాంటి సమస్యలు రావు. వర్షం పడుతున్నప్పుడు మొబైల్ తడవకుండా జాగ్రత్త వహించాలి. అందుకు కవర్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం కొన్ని మొబైల్ కంపెనీలు నీటిలో తడిసినా బాగుంటాయని ఫోన్లు అందుబాటులోకి తెచ్చాయి. ఒకవేళ తడిస్తే ఫోన్ నుంచి బ్యాటరీని తీసి ఆరబెట్టాలి. తడిసిన సమయంలో ఫోన్‌ను ఆన్‌చేసి వినియోగించరాదు. అలా చేస్తే డిస్ప్లే పాడైపోతుంది. ఉరుములు, పిడుగులు పడే సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడరాదు. ఫోన్‌ను టీవీ దగ్గర ఉంచరాదు. ఒక్కో సమయంలో పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇటీవల కాలంలో కెమెరా, ల్యాబ్‌టాప్, ట్యాబ్ వినియోగం పెరిగింది. వర్షాకాలంలో బయటకు వెళ్లినప్పుడు కెమెరాలోని లెన్స్, చిప్, బ్యాటరీ వంటివి పాడవుతాయి. విడి భాగాలు బయట కొనాలంటే ధర ఎక్కువ. అందువల్ల స్పాంజితో ఉన్న కవర్ వాడాలి. వర్షంలో ఫొటోలు దిగడం, సూర్య కిరణాలకు ఎదురుగా ఫొటోలు తీయకపోవడమే మంచిది. ఆన్‌లో ఉన్న టీవీని ఫొటోలు తీయరాదు. ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు వీటిని ఆన్చేయకూడదు.