Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్
నవతెలంగాణ-మెదక్ టౌన్
పంచాయతీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ అన్నారు. మెదక్ జిల్లా గ్రామపంచాయతీ 8వ జిల్లా మహాసభలు మెదక్ జిల్లా సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం హసిఫ్ అధ్యక్షతన జరిగాయి. మహాసభలకు ముఖ్య అతిథిగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్, సీఐటీయూ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.నర్సమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలడుగు సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 12,770 గ్రామపంచాయతీలలో 36,500 మంది గ్రామపంచాయతీ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని, సంవత్సరాలు గడిచినా పంచాయతీ కార్మికులను ప్రభుత్వాలు పటించుకోకుండా వెట్టి చాకిరీ చేయిస్తున్నాయని ఆరోపించారు. పని భద్రత, కనీస వేతనాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో పారిశుద్ధ పనులు చేస్తూ చాలీచాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ అనారోగ్యాల పాలై ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల వలె జీవో నెంబర్ 60 ప్రకారం వివిధ కేటగిరీల వారిగా వేతనాలు పెంచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పనులు చేస్తున్న పంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, జీవో నెంబర్ 51ను సవరించాలని డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, అర్హత కలిగిన కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ కల్పించి పదోన్నతులు కల్పించాలని, మేమో 20, 26 సాకుతో పంచాయతీ సిబ్బందితో మరుగుదొడ్లు కడిగించే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమంగా పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికుల తొలగింపులు ఆపాలని, ప్రతినెల 5వ తేదీ లోపు కార్మికులకు జీతాలు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా పంచాయతీరాజ్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి గ్రామపంచాయతీ కార్మికులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగే పోరాటాలలో మెదక్ జిల్లా గ్రామపంచాయతీ కార్మికులందరూ ఐక్యంగా ఆందోళన పోరాటాలలోకి రావాలని కోరారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నరమ్మ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి యూనిఫామ్, గ్లౌజులు, సబ్బులు నూనెలను విధిగా అందించాలన్నారు. జిల్లావ్యాప్తంగా కార్మికుల ఇన్సూరెన్స్ స్కీమును పకడ్బందీగా అమలు చేయాలని, అనారోగ్యం పాలై మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు, గ్రామపంచాయతీ మెదక్ జిల్లా కార్యదర్శి ఆసిఫ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బందిని ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని, స్థానిక సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యం వీడనాడాలని డిమాండ్ చేశారు. జిల్లా గ్రామపంచాయతీ అధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ స్థానిక సమస్యల పరిష్కారం కొరకు జిల్లావ్యాప్తంగా ఉన్న గ్రామపంచాయతీ కార్మికులందరూ ఐక్యం కావాలని, ప్రభుత్వాల నిరంకుషానికి, మోసానికి వ్యతిరేకంగా ఆందోళన పోరాటాలు చేయాలన్నారు. మహాసభల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పోడు సాగుదారుల పోరాటానికి సంఘీభావంగా రాష్ట్ర కేంద్రానికి రూ.1410 ల విరాళాన్ని అందించడం జరిగింది. ఈ మహాసభలకు జిల్లావ్యాప్తంగా 21 మండలాల నుంచి గ్రామపంచాయతీ నాయకులు కార్మికులు హాజరయ్యారు.