Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంకా కొనసాగుతున్న ముసురు
- ఏడు సెంటీమీటర్లు దాటిన వర్షపాతం
నవతెలంగాణ-గజ్వేల్
ప్రస్తుతం వర్షాకాలంలో పంటల సాగు ముమ్మరంగా సాగుతోంది. సిద్దిపేట జిల్లాలో కురుస్తున్న వర్షంతో కొన్ని మండలాల్లో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరికొన్ని చోట్ల నాలుగు సెంటీమీటర్ల వర్షం కురిసింది. వారం రోజులుగా వరుసగా కురిసిన భారీ వర్షానికి రైతులు పత్తి, వరి, మొక్కజొన్న, కంది, పంటలు సాగు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఇప్పుడిప్పుడే నారు పోస్తుండగా మరికొన్ని చోట్ల వరినాట్లు ప్రారంభమయ్యాయి. ఇంకొన్ని చోట్ల వరి నారు తీస్తున్నారు. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్, కొండపాక, దౌల్తాబాద్, తొగుట, మిరుదొడ్డి, రాయపోల్, వర్గల్, ములుగు, నంగునూరు, కొమరవెల్లి, మద్దూరు, దూల్మిట్ట, జగదేపూర్, అక్కన్నపేట, బెజ్జంకి, కోహెడ, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట్ తదితర మండలాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. పత్తి, కంది పంటలపై ఎక్కువ దృష్టి పెట్టాలని క్షేత్రస్థాయిలో అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. గత ఏడాది ఐదు లక్షల 36 ఎకరాలలో సాగు చేశారు. ప్రస్తుతం వర్షాకాలంలో వ్యవసాయ అధికారులు అంచనా ప్రకారం 5.41 లక్షలపైగా ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు ఫర్టిలైజర్, విత్తనాలను అందుబాటులో ఉంచారు. 62,500 వరి విత్తనాలు, ఐదు లక్షల ప్యాకెట్లు పత్తి విత్తనాలు, 16 వందల క్వింటాళ్ల కంది విత్తనాలు, నాలుగువేల క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనాలు అందుబాటులో ఉంచారు. 49,888 మెట్రిక్ టన్నుల యూరియా, 26 వేల మెట్రిక్ టన్ల డీఏపీ, 800 మెట్రిక్ టన్నుల ఫొటాస్, 51 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు అంటున్నారు. గజ్వేల్‌కు రైల్వే రేక్‌పాయింట్ రావడంతో అనేక సమస్యలు తీరినట్లు రైతులు పేర్కొంటున్నారు. గజ్వేల్‌తో పాటు యాదాద్రి భువనగిరి, నల్లగొండ తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి సరఫరా చేసే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటికే గ్రామాల్లోకి ఫర్టిలైజర్, విత్తనాలు తీసుకెళ్లిన రైతులు వ్యవసాయ పనుల్లో నిమగమై ఉన్నారు. 15 రోజులుగా వస్తున్న వర్షానికి కొందరు ఇబ్బంది పడిన రైతులు సాగు పనుల్లో నిమగమయ్యారు. మొక్కజొన్న పంటను 50 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారని, ఎందుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని అధికారులు పేర్కొంటున్నారు. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం గజ్వేల్, సిద్దిపేట. దుబ్బాక, హుస్నాబాద్ తదితర ప్రాంతాల్లో 2.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉంది. మరో రెండు లక్షల ఎకరాలలో పత్తి సాగు చేయడానికి రైతులు సిద్ధమయ్యారు. ఇప్పటికి 70 శాతానికిపైగా పత్తి విత్తనాలు నాటారు. కంది పంటపై రైతులకు అవగాహన, సూచనలు ఇస్తున్నామని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. సిద్దిపేట ప్రాంతంలో 30 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు. దీన్ని మరింత పెంచాలని తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఇతర ప్రాంతాల్లో కూడా సాగు పెంచాలని ఆదేశించింది. లాభాలు ఉన్నాయని ప్రభుత్వం భావించి ఆయిల్ ఫాంపై దష్టి పెట్టాలంది.
మురిపిస్తుంది
ఇప్పుడైతే వర్షం మురిపిస్తుంది. రేపు ఏం చేస్తుందో. వరి నాట్లు వేశాం. పత్తి, కంది కూడా నాటాం. గజ్వేల్‌లోనే ఉండడం సౌకర్యంగా ఉంది. గతంలో ఎరువుల కోసం ఎదురు చూసేవాళ్లం. ఇప్పుడు రైల్లో గజ్వేల్‌కు వస్తున్నాయి. ఇది సంతోషంగానే ఉంది.
- రైతు బొడ్డు రాజయ్య
నాటు వేస్తున్నాం
వరి నాటు వేస్తున్నాం. రాయపోల్‌లో వర్షం మంచిగానే పడుతుంది. రోజు ముసురు వస్తుంది. కొంత ఇబ్బందైనా పంటు సాగు చేసుకుంటున్నాం. పత్తి పంట బాగా సాగు చేస్తున్న. ఎంత దిగుబడి వస్తావో చూడాలి.
- రైతు బోడ ఎల్లయ్య.