Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేజీకేఎస్ జిల్లా కార్యదర్శి బండకింది అరుణ్ కుమార్
నవతెలంగాణ-మద్దూరు
కల్లుగీత కార్మికుల సమస్యలపై సర్వాయి పాపన్న స్ఫూర్తితో పోరాటం చేయాలని కల్లుగీత కార్మికుల సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శి బండకింది అరుణ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా దూల్మిట్ట మండల కేంద్రంలో పాపన్న స్ఫూర్తితో అమరుల యాది చైతన్య సభలను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజ శ్రేయస్సుకోసం, కల్లుగీత కార్మికుల సంక్షేమ కోసం పనిచేసి అమరులైన త్యాగమూర్తులను స్మరించుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 2 నుండి 18 వరకు గ్రామ గ్రామాన సామాజిక చైతన్య యాత్రలు చేసి సభలు, సమావేశాలు నిర్వహించి ముగింపు ఉత్సవాలు జనగామ జిల్లా ఖిలషాపురంలో సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి రోజున ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కల్లుగీత కార్మికులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వాటి సామాజిక సమానత్వం కోసం పోరాడి శ్రామిక రాజ్యం సాధించడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఉన్న గీత కార్మికులందరికీ వత్తికి ఉపయోగపడే విధంగా ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని, సంవత్సరంలో వత్తి ఆరునెలలే ఉంటున్నందున మిగతా కాలం జీవించడానికి గీతన్న బందు పేరుతో కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో నీరా, తాటి ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేసి గౌడ యువతి యువకులకు ఉపాధి కల్పించాలని కోరారు. మద్య నిషేధం దశలవారీగా అమలు చేయాలని ఆయన కోరారు 50 సంవత్సరాలు పైబడిన వారికి గత నాలుగు సంవత్సరాల నుండి పెన్షన్ ఇవ్వడం లేదని వారికి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వలన చెట్లు ఎక్కకపోవడంతో గీత కార్మికులు నష్టపోయారు. వీరికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ట్యాంక్ బండ్ పై పాపన్న విగ్రహం ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మేరిండ్ల శ్రీనివాస్ గౌడ్, జిల్లా నాయకులు కొల సత్తయ్య గౌడ్,తాళ్లపల్లి కనకయ్య గౌడ్,నాచగొని శ్రీనివాస్ గౌడ్,గ్రామ నాయకులు నాచగొని చెందు గౌడ్,నరహరి,రాజయ్య,సత్యం, వెంకట్, కైలాసం,ఆనందం, విజరు కుమార్, గణేష్, కిష్టయ్య, నర్సయ్య, రాములు, అశోక్, మహేష తదితరులు పాల్గొన్నారు.