Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాల అభివృద్ధికి సొంత ఖర్చు రూ.4 లక్షలు
- మండలంలో నెంబర్ వన్ పాఠశాలగా రాయిలాపూర్ ప్రాథమిక పాఠశాల
- హెచ్ఎం బోయిని కృష్ణను అభినందించిన సర్పంచ్ కుర్మ శేకులు
నవ తెలంగాణ-కౌడిపల్లి
మండలంలోని రాయిలాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఆహ్లాదకర వాతారణాన్ని చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. మండలంలో 60 పాఠశాలలు ఉండగా 6,200 పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. రాయిలాపూర్ ప్రాథమిక పాఠశాలలో 72 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రధానోపాధ్యాయులు బోయిని కృష్ణ కొన్ని సంవత్సరాలుగా తన సొంత డబ్బు రూ.4 లక్షలు ఖర్చు చేసి పాఠశాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వం నుంచి వచ్చే బడ్జెట్ కోసం ఎదురుచూసే ఉపాధ్యాయులు ఉన్న ఈ రోజులలో హెచ్ఎం సొంత ఖర్చులతో పాఠశాలకు పెయింటింగ్ వేయించారు. గోడలపై విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను రాయించారు. గోడలపై మహనీయుల చిత్రపటాలను వేసి వారి గురించి పాఠ్యాంశంగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేస్తున్నారు. కార్పొరేట్‌కు దీటుగా ఈ పాఠశాలలో కుర్చీలు, టేబుల్స్, యూనిఫామ్స్ ఆయన సొంత ఖర్చులతో ఇప్పించారు. హరితహారంలో భాగంగా పాఠశాలలో చెట్లు నాటించారు. ప్రతి చెట్టుకు మహనీయుల పేర్లు పెట్టారు. వాటి నిర్వహణ బాధ్యతను విద్యార్థులకు అప్పగిస్తూ రోజువారీగా నీళ్లు పోసి చెట్లను పెంచాలని వారికి సూచించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించేందుకు బడి బయట గల పిల్లలను తానే స్వయంగా వారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు నచ్చజెప్పి విద్యార్థులను పాఠశాలకు తీసుకొచ్చిన సంఘటన ఎన్నో ఉన్నాయి. ప్రధానోపాధ్యాయులు బోయిని కృష్ణను సర్పంచ్ కుర్మ శేకులుతో పాటు గ్రామస్తులు అభినందించారు.