Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రిపుల్ఆర్ భూ బాధితుల ఆందోళన
- ఇండ్ల కోసం డాకూర్ ప్రజల ధర్నా
- భూమి, పింఛన్ల కోసం పిటీషన్లు
- చిట్టీ పేర రూ.4 కోట్ల మోసం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రజావాణి కార్యక్రమానికి వినతులు, పిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి సోమవారం వేలాది మంది ప్రజలు భూములు, పింఛన్లు, ఇండ్లు, రేషన్‌కార్డులతో పాటు వివిద సమస్యల పరిష్కారం కోసం వస్తున్నారు. రెండు మూడు వారాల పాటుగా దరఖాస్తులు చేస్తున్నా పరిష్కారం కావట్లేదని బాధితులు పదేపదే తిరుగుతున్నారు. వివిద శాఖల అధికారులు ప్రజావాణికి వస్తున్నా ప్రజల పిర్యాదుల్ని పరిశీలించి పరిష్కరించడంలో శ్రద్ద చూపట్లేదనే విమర్శలున్నాయి. కొందరు అధికారులు ప్రజావాణిలో కూర్చోని సెల్పోన్లో గేమ్స్ ఆడుతున్నారని కలెక్టర్ ఎ.శరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆదేశించారు.
ప్రజావాణి సందర్భంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్వోతో పాటు వివిద శాఖల అధికారులు కలుస్తారనే నమ్మకంతో ప్రజలు వినతులతో వస్తున్నారు. సోమవారం వందలాది మంది ధరణిలో భూముల సమస్యలున్నాయని, ఫించన్లు మంజూరు చేయాలని, రేషన్‌కార్డులివ్వాలని కోరుతూ దరఖాస్తుల్ని అందజేశారు. కలెక్టర్ ఎ.శరత్ స్వయంగా ప్రజలతో మాట్లాడి పిర్యాదుల్ని స్వీకరించారు. సంబంధిత అధికారులకు వెరిపై చేసి పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున వచ్చారు. జహీరాబాద్, ఇతర ప్రాంతాల్లోని వేలాది ఎకరాల భూముల్ని ధరణి పేరిట పట్టాదారులకు అందకుండా చేశారని ఆధారాలతో జిల్లా కలెక్టర్‌కు పిర్యాదు చేశారు. ఆల్ ఇండియా కిసాన్ సెల్ అధ్యక్షులు కోదండరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలజగ్గారెడ్డి, చంద్రారెడ్డి, ఎంపీటీసీ విజయకుమార్‌తో పాటు బాధిత రైతులు కలెక్టర్‌ను కలిశారు. 2017 నుంచి తమ పట్టాభూముల్ని వక్ఫ్ బోర్డు గెజిట్‌లో చేర్చడంతో సత్వార్ గ్రామంలోనే 854 ఎకరాల్ని పట్టాదారులకు హక్కు లేకుండా చేసినట్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అదే విధంగా ఆందోల్ మండలంలోని డాకూరు గ్రామానికి చెందిన వందలాది మంది ప్రజలు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సర్పంచ్ పూజా గౌడ్, మాజీ ఎంపీటీసీ రమేష్‌గౌడ్, సామాజిక హక్కుల సంఘం నాయకులు ముప్పారం ప్రకాశం, పద్మారావు, డబుల్బెడ్రూం ఇళ్లు మంజూరు కాని పేదలు కలెక్టర్‌ను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. డాకూరులో 104 డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించిన ప్రభుత్వం అర్హులకు ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. లారీలు, జేసీబీలు, ఆస్తులున్న వ్యక్తులకు ఇచ్చి నిరుపేదల్ని విస్మరించారని ఆధారాలతో సహా అధికారులకు తెలియజేశారు. అదే విధంగా హత్నూర్ మండలంలోని దేవులపల్లి గ్రామానికి చెందిన ట్రిపుల్ఆర్ భూబాధితులు కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టర్‌ను కలిసి తమ భూముల్ని సేకరించవద్దని కోరారు. ఇప్పటికే కాలేశ్వరం, నారాయణఖేడ్ కాల్వ కోసం భూములిచ్చామని, ఉన్న కొద్ది భూమిని ట్రిపుల్ఆర్ కని తీసుకోవడం న్యాయం కాదని వేడుకున్నారు. అదే విధంగా పటాన్చెరు ప్రాంతంలోని వందలాది మందిని చిట్టీల పేరిట మోసం చేసి రూ.4 కోట్లతో ఉడాయించిన విషయం గురించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పార్వతమ్మ అనే మహిళ తనకు వారసత్వంగా వచ్చిన భూమిని తన పేరిట పట్టా చేయడంలేదని ప్రజావాణిలో పిర్యాదు చేసింది. తన తండ్రి ఆస్తిలో భాగం ఇవ్వాలని కోర్టు ఆదేశాలిచ్చినా అధికారులు తమకు భూమిని ఇవ్వడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే అట్టి ఫైలు జిల్లా కలెక్టర్ వద్దనే ఉందని కింది స్థాయి రెవెన్యూ అధికారులు ఆమెతో చెప్పడం, ఆమె కలెక్టర్‌ను కలిసేందుకు వీలు కల్పించకపోడం కొసమెరుపు. సంగారెడ్డి పట్టణంలో 30 ఫీట్ల రోడ్డును ఆక్రమించుకుని నిర్మించిన ఆడిటోరియంపై గ్రీన్‌కౌంటీ సొసైటీ హైకోర్టులో కేసు వేసింది. రోడ్డు ఆక్రమణపై విచారించిన కోర్టు దానిని తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశించిన సంగారెడ్డి మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని సొసైటీ ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అక్రమంగా దుకాణాన్ని కబ్జా చేసి బెదిరిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సదాశివపేటకు చెందిన కల్బుర్గె రాజశ్రీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.