Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు శశీధర్
నవతెలంగాణ-హుస్నాబాద్
తెలంగాణ సాయుధ పోరాట యోధుల స్ఫూర్తితో కార్యకర్తలు దోపిడీ పాలనపై ఉద్యమించాలని సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రాళ్లబండి శశీధర్ కోరారు. సోమవారం ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి తెలంగాణ తొలి సాయుధ పోరాటంలో నేలకొరిగిన వీరులను స్మరించుకున్నారు. ఈసందర్భంగా హుస్నాబాద్‌లోని అనబేరి ప్రభాకర్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెలమదొరలు, భూస్వాములు, దేశ్ ముఖ్ ల అరాచకాలతో తెలంగాణ ప్రజలు నలిగిపోయారన్నారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం కమ్యూనిస్టులు పోరాడారని, వారి త్యాగాల ఫలితంగా గ్రామ స్వరాజ్యాలు ఏర్పడ్డాయన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో వీర విప్లవ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందన్నారు. మొట్టమొదటి సాయుధ పోరాటంలో అనబేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డితో పాటు మరో పన్నెండు మంది వీరులు అమరులయ్యారని వవరించారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్నారన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో కమ్యూనిస్టులు తెలంగాణలో పేద ప్రజలకు 10 లక్షల ఎకరాల భూములు పంచారన్నారు. ప్రజలను వెట్టి నుంచి విముక్తి కల్పించి, ఆత్మగౌరాంతో తలెత్తుకొని తిరిగే విధంగా చేశారన్నారు. ఎర్రజెండా నాయకత్వంలో గ్రామ గ్రామాన రక్షక దళాలు ఏర్పడి రజాకార్లను, భూస్వాములను తుద ముట్టించారని చెప్పారు. రజాకార్లు, భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన ఆ పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పోరాట ఘట్టాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్ ప్రాంతంలో ప్రజల పక్షాన పోరాడి నేలకొరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులు అనబేరి ప్రభాకర్ రావుతోపాటు అనేకమంది వీరుల ఆశయ సాధన కోసం సీపీఐ(ఎం) పోరాడుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ప్రజలు తమతో కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు చొప్పరి రవికుమార్, హుస్నాబాద్ మండల బాధ్యుడు గూగులోత్ శివరాజ్, నాయకులు రాజు, సంపత్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.