Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హౌజ్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్
నవతెలంగాణ-హుస్నాబాద్
టీఆర్ఎస్ నాయకుల ప్రయోజనాల కోసం పని చేస్తున్న హుస్నాబాద్ ఎమ్మెల్యేను అభివృద్ధి ప్రదాత అని సంబోధించడం వింతగా ఉందని హౌజ్ ఫెడ్ మాజీ చైర్మన్, బీజేపీ నాయకుడు బొమ్మ శ్రీరామ్ విమర్శించారు. అంగన్వాడీ కేంద్రాలు సమస్యల వలయంలో కూరుకుపోయినా పట్టించుకోని ఎమ్మెల్యే సతీశ్ కుమార్ అభివద్ధి ప్రదాత ఎలా అవుతారని ప్రశ్నించారు. మంగళవారం ఆయన హుస్నాబాద్ లోని కస్తూర్బా కాలనీలో గల అంగన్వాడీ కేంద్రంలో వసతులు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్న తీరును పరిశీలించారు. సిద్దిపేట జిల్లాలోని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివద్ధి పరుగులు పెడుతుంటే, హుస్నాబాద్ నియోజకవర్గంలో మాత్రం అన్ని పనులూ పెండింగ్ లో ఉన్నాయన్నారు. నియోజకవర్గంలో ఒక్క దళితుడికైనా 3 ఎకరాల భూమి ఇప్పించలేదన్నారు. ఎనిమిదేండ్లుగా పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదన్నారు. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయని చెప్పారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలోనైతే అడుగుకో గుంత ఉందన్నారు. హుస్నాబాద్ కు సమీపంలో ఉన్న రేగొండ, గోవర్ధనగిరి గ్రామాలను 25 కిలోమీటర్ల దూరం ఉన్న అక్కన్నపేటలో విలీనం చేసి, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. హుస్నాబాద్ లోని మినీ స్టేడియాన్ని టీఆర్ఎస్ రియల్టర్లు ఆక్రమించినా పట్టించుకోకుండా ఉన్నారన్నారు. మండల కేంద్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను టీఆర్ఎస్ లీడర్లు, రియల్టర్ల ప్రయోజనం కోసం ఊరి బయటకు తరలిస్తూ, హుస్నాబాద్ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆలనాపాలనా లేకుండాపోయిందని మండిపడ్డారు. కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో చిన్నారులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కస్తూర్బా కాలనీలోని అంగన్వాడీ కేంద్రానికి కనీసం సూచిక బోర్డు కూడా లేకపోవడం ఎంతటి నిర్లక్ష్యమో తెలుస్తోందన్నారు. పిల్లలకు మూత్రశాలలతోపాటు కరెంట్ సౌకర్యం కూడా లేదన్నారు. ఇక్కడ అంగన్వాడీ టీచర్ కూడా లేరన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీ కేంద్రంలో వసతులను కల్పించి, పిల్లలు, గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆపార్టీ హుస్నాబాద్ మండల అధ్యక్షుడు చక్కబండి విద్యాసాగర్ రెడ్డి, సెన్సార్ బోర్డు సభ్యురాలు తిరుమల, కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, అక్కు శ్రీనివాస్ ఉన్నారు.