Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోగిపేటలో ఆంధ్రమహాసభ
- పోరాట త్యాగాలను చెరిపే కుట్ర
- నేడు వారోత్సవాల ముగింపు సభ
- తమ్మినేని, చుక్క రాములు హాజరు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రజా పోరాటాల ఫలితమే రాచరిక పాలన అంతం. ఇదే చారిత్రిక సత్యం. కానీ..! తెలంగాణ పోరాటాలను...త్యాగాలను...బలిదానాలను చెరిపే యడానికి కుట్ర జరుగుతున్న తీరు జుగుస్సాకరంగా ఉంది. తెలంగాణ అస్థిత్వం...సంస్కృతి...చరిత్రపై రాక్షస బల్లుల వలె దాడి చేయడం విడ్డూరం. నిజాం రజాకార ముష్కరుల ఆగడాలు, జాగీర్లు, జమీన్దార్ల అరాచకాలను తెలంగాణ మట్టి మనుషులు తిప్పికొట్టిన చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ఎండగట్టకపోతే సత్యాలను సమాధి చేసినవాళ్లమవుతాం. రజాకార్లు గ్రామాల్లో పడి మగవాళ్లను చంపడం, మహిళలను చరచడం వంటి ఘోరాలకు పాల్పడి రాక్షసానందం పొందినపుడు జమీందార్ల, దేశ్‌ముఖ్‌ల ఘడీలలో విందులు, వినోదాలు చేసిన హీన చరిత్ర అనాటి హిందూ మహాసభ, ఆర్యసమాజ్ సంఘాలది అనే నిజాలను నేటి సమాజం తెలుసుకోవాలి.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను వారం రోజుల పాటు వామపక్షాలు ఊరూరా నిర్వహించాయి. సీపీఐఎం, సీపీఐ, ఇతర కమ్యూనిస్టుల పార్టీలు నాటి సాయుధ పోరాట వారసత్వంతో ప్రజా పోరాటాలను నడుపుతున్నాయి. నాటి పోరాటంలో పాల్గొన్న ఎర్రజెండా పార్టీల కంటే ఆ చరిత్రకే సంబంధంలేని కొన్ని పార్టీలు చరిత్రను వక్రీకరిస్తున్నాయి. సెప్టెంబర్ 17న విమోచన దినంగా కేంద్రంలోని బీజేపీ పభుత్వం...తెలంగాణ జాతీయ సమైఖ్య దినోత్సవం పేరిట రాష్ట్ర ప్రభుత్వం వేడుకల్ని జరుపకుంటున్నాయి. నైజాం ఎస్టేట్ విలీనమైన తర్వాత నిజాంను రాజ్‌ప్రముఖ్‌గా పెట్టిన భారత ప్రభుత్వం తన సైన్యాలను తిరిగి తీసుకవెళ్ల కుండా ఇక్కడే ఉంచి కమ్యూనిస్టులపై దాడులు జరిపారు. నిజాం రజాకార్లతో జరిగిన పోరాటంలో బలైన వారి కంటే ఇండియన్ యూనియన్ సైన్యంతో జరిగతిన పోరాటంలోనే కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎక్కువ మరణించారు
జోగిపేటలో ఆంధ్రమహాసభ
1946లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1951 వరకు సాగింది. ఈ పోరాటానికి ఆంధ్రమహాసభ నాంధి పలికింది. 1940 కాలంలో నైజాం ఎస్టేట్‌లో 'కామ్రేడ్స్ అసోసియేషన్'ను ప్రస్తుత సంగారెడ్డి జిల్లా ఆందోల్‌కు చెందిన కవి ముగ్దుం మొయినొద్దీన్, ఆలకుందు మిరి, రాజ్ బహుద్దూర్ గౌర్ వంటి వారు ఏర్పాటు చేశారు ఆంధ్రమహాసభ జోగిపేటలో జరిగింది. అలా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఊరూరా వ్యాప్తించడంతో పాత మెదక్ జిల్లాలోని అనేక గ్రామాల్లో గెరిల్లా దళాలు, గ్రామ రక్షక దళాలుగా ఏర్పడి రజాకార్లు, జమీన్‌దార్లకు వ్యతిరేకంగా పోరాడారు. అనాటి పోరాట వారసత్వంతో ఈ ప్రాంతంలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ బలపడింది. అందులో నారాయణరెడ్డి, విఠల్‌రెడ్డి, కేవల్ కిషన్ ఇతర నాయకులు సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, జోగిపేట, సదాశివపేట, ఆందోల్ వంటి ప్రాంతాల్లో భూముల కోసం ప్రజా పోరాటాలు సాగాయి. పాత వరంగల్ ప్రాంతంలో ఉన్న ప్రస్తుత సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్న చేర్యాల, కొమురవెల్లి, మద్దూరుతో పాటు గజ్వేల్, దుబ్బాక ప్రాంతాల్లోనూ సాయుధ పోరాటంలో వేలాది మంది ప్రజలు వెట్టికి వ్యతిరేకంగా పోరాడారు. బైరాన్‌పల్లి, దూటికల్ వంటి గ్రామాల్లో రజాకార్ల కాల్పుల్లో వందల మంది చనిపోయాయి.
నేడు వారోత్సవాల సభ
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలలో భాగంగా శనివారం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని పీఎస్ఆర్ గార్డెన్లో ముగింపు సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సీపీఐ(ఎం) కార్యకర్తలు, నాయకులు, ప్రజా సంఘాల కార్యకర్తలు, ప్రజలు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, యువజనులు, విద్యార్థులు, మహిళాలు నాటి పోరాట స్ఫూర్తిని చాటేందుకు ఎర్రజెండాలతో కదలిరానున్నారు.
పోరాట వారసులు కమ్యూనిస్టులే : గొల్లెపల్లి జయరాజు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసులు కమ్యూనిస్టులే. నాటి పోరాట స్పూర్తితో సీపీఐ(ఎం) ప్రజల పక్షాన పోరాటాలు చేస్తోంది. నిజాం రజాకార్లతో పాటు స్థానిక భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్ల ఆగడాలు, దాడులకు వ్యతిరేకంగా ఎర్రజెండా నాయకత్వాన గెరిల్లా పోరాటం సాగింది. ఈ పోరాటంలో నాలుగు వేల గ్రామాలు విముక్తి కాబడ్డాయి. లక్షలాది ఎకరాలను పేదలకు పంచబడింది. నిజాం ప్రభువు లొంగిపోయిన తర్వాత కూడా యూనియన్ సైన్యం దాడులు చేసింది. భూములకు హక్కులు వచ్చే వరకు సాయుధ పోరాటాన్ని సాగించిన ఫలితంగానే నెహ్రు ప్రభుత్వం రక్షిత కౌల్దారీ చట్టం తెచ్చారు. నాటి పోరాటంలో బీజేపీ, దాని అనుబంధ సంఘాలకు సంబంధమే లేదు.
పోరాడింది ఎర్రజెండా:గొల్ల కొమరయ్య, సాయుధ పోరాట యోధులు
రజాకార్లు, జాగీర్లు, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా ఎర్ర జెండా వాళ్లు పోరాడిండ్రు. ఆ తర్వాత మిలటరీ సైన్యం వచ్చింది. సైన్యం కూడా కమ్యూనిస్టులపై దాడులు చేసింది. నిజాంకు వ్యతిరేకంగా సైన్యానికి వ్యతిరేకంగా ఎర్రజెండా పోరాడింది. ఆ జెండా వల్లనే ఊర్లల్లో వెట్టి పోయింది. జీతగాళ్లు, పాలేర్లు, వృత్తుల వాళ్లు స్వేచ్చను పొందారు. పట్టేల్, పట్వారీలు జంకిండ్రు. గిపుడు బీజేపోళ్లు ఏదో చెప్పబట్టిండ్రు. గప్పుడు గీ పార్టీలేదు.
శవాల దిబ్బల్ని బండ్ల మీద మోసినం : ఊకొట్ల ఇస్తారి
రజాకార్లు ఊరిమీద పడి పిట్టల్ని కాల్చినట్లు కాల్చిండ్రు. ఇండ్లళ్ల చొరబడి పట్టుకొచ్చిండ్రు. బురుజు కాడ శవాల దిబ్బ పోగైంది. కళ్లార చూస్తుండగనే కాల్చిచంపిండ్రు. ఆ శవాలను బండ్ల మీద తీసుకెళ్లినం. గట్ల పోరాడిండ్రు కాబట్టే గిప్పుడు గింత స్వేచ్చగ ఉన్నం. ఎర్రజెండా లేకపోతే ఏమై పోతుంటిమో. నేను చిన్నగుంటిని. సైన్యం క్యాంపుల వద్ద పాడి పశువుల కాపుకాసే జీతం చేసిన.