Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాంతి కాముకంగా జీవిద్దాం
- అద్బుత పథకాలతో బంగారు తెలంగాణ
- కాలేశ్వరం ప్రాజెక్టు వరల్డ్‌లోనే గొప్పది
- తెలంగాణ జాతీయ సమైక్యతా వారోత్సవాల్లో కలెక్టర్ శరత్, ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్
నవతెలంగాణ-సంగారెడ్డి
జాతి సమైక్యతే ప్రధానంగా శాంతి కాముకంగా జీవించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పిలుపు నిచ్చారు. శుక్రవారం పట్టణంలో 16 వేల మంది విద్యార్థులు, మహిళలు జాతీయ జెండాలు చేతబూని భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్థానిక అంబేద్కర్ స్డేడియంలో సభ నిర్వహించారు. జాతీయ సమైక్య అంటే మనమందరం సంఘటితంగా జీవించడమే అన్నారు. ఐక్యంగా శాంతియుతంగా జీవించడం ద్వారానే అభివృద్ధిని సాధించగలమన్నారు. పోరాటాల ద్వారా తెలంగాణ సాధించుకున్న మనం బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అద్బుతమైన పథకాలను అమలు చేస్తుందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్బుతమైన కట్టడంగా పేర్కొన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాల ద్వారా సాగు, తాగునీటి కష్టాలు తొలగి పుష్కలంగా పంటలు పండుతున్నాయన్నారు. 2014కు ముందు సంగారెడ్డి జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగవ్వగా ప్రస్తుతం 7.50 లక్షల ఎకరాల్లో వివిద పంటలు సాగు అయ్యాయన్నారు. ప్రతి నెలా జిల్లాలో రూ.30 కోట్లను ఫించన్లుగా చెల్లిస్తున్నామన్నారు. 2906 కోట్ల వరకు రైతులకు పెట్టుబడి సాయంగా ఇస్తున్నామన్నారు. ఇలా అనేక పథకాల్ని అమలు చేసుకుంటూ జిల్లా ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందన్నారు. ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ మాట్లాడుతూ భిన్నమైన భాషలు, మతాలు, కులాలు, సంస్కృతులు కల్గినప్పటికీ భారత దేశం సమైక్యంగా ఉంటుందన్నారంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పుణ్యమే అన్నారు. హిందూ హిందూ బాయి బాయి...ముస్లీం ముస్లీం నహీ నహీ అనే నినాదం కాకుండా ''హిందూ, ముస్లీం, సిక్కూ, సాయి భోలో హంసే బాయి బాయి'' అనే నినాదంలో భారతీయులందరూ కలిసి జీవించాలన్నారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య లాంటి వీరులు సాయుధ పోరాటం చేశారన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన కేసీఆర్ స్వరాష్ట్రాన్ని సాధించారన్నారు. దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్‌గా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో మనం పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి కార్పొరేషన్ సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, ఎస్పీ రమణకుమార్, మున్సిపర్ చైర్పర్సన్ బోగుల విజయలక్ష్మీ, వైస్ చైర్పర్సన్ లతావిజయేందర్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, జేసీ వీరారెడ్డి, ఆర్డీఓ నాగేష్ పాల్గొన్నారు.