Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్యాగధనుల పోరాట ఫలమే రాచరిక పాలన అంతం
- సమైక్య రాష్ట్రంలో అన్నింటా తెలంగాణకు వివక్ష
- కాలేశ్వరంపై తప్పు మాట్లాడితే నోటిశుద్ది, దేహశుద్ది
- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు
నవతెలంగాణ-సిద్దిపేట
మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ది పొందాలని బీజేపీ ఆరాట పడుతుందని, వారికే అధికారం కట్టబెడితే అభివృద్ది శూన్యమవుతుందని రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. భిన్న భాషలు, మతాలు ఉన్నప్పటికీ భారతదేశం సమైఖ్యంగా ముందడుగు వేస్తుందని పేర్కొన్నారు. పప్రపంచంలోనే అద్బుత నిర్మాణమైన కాలేశ్వరం పాప్రాజెక్టుపై ఢిల్లీలో ఒకరు, హైదరాబాద్ మరొకరు టీవీలలో ప్రాజెక్టు ద్వారా ఒక ఎకరం నీరు పారింది లేదని మాట్లాడుతున్నారన్నారు. మన ప్రాంతం దిక్కు వచ్చే వారికి కాలేశ్వరం నీటిని చూపించి నోటి శుద్ధి, దేహశుద్ధి చేసి పంపిస్తారమని హెచ్చరించారు. ప్రజాపోరాటాల ఫలితంగానే రాచరిక పాలన అంతమొంది ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చామని అన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం జరిగిందని, ఎప్పటి కప్పుడు రాచరిక, పెత్తందార్ల పెత్తనాన్ని ఈ గడ్డ తిప్పి కొట్టిందని, యావత్ తెలంగాణ ప్రజానీకం సకల జనుల సమ్మెతో ఢిల్లీని గడగడలాడించి తెలంగాణ సాధించామని అన్నారు. దేశానికి 1947లో గాంధీజీ నేతత్వంలో స్వతంత్రం వచ్చిందని, ఎంతో మంది ఆనాటి త్యాగధనుల పోరాటమే రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య దేశంలో మనం 1948 సెప్టెంబర్ 17న అడుగుపెట్టినామన్నారు. 75 సంవత్సరాల క్రితం రాచరికల పాలనలో ఉన్న మనం, ఇప్పుడు తెలంగాణ చరిత్రను భావితరాలకు తెలియజేసే విధంగా సీఎం కెసిఆర్ పిలుపుతో మూడు రోజులపాటు వజ్రోత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం 80 శాతం అని, సంపద పెంచు పేదలకు పంచు అనేదే సీఎం కేసీఆర్ నినాదమని అన్నారు. దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకుంటున్నదని, రాష్ట్రంలో 973 రెసిడెన్షియల్ స్కూల్ లో 4.50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ వివక్షకు గురైందని అన్నారు. సరస్వతి నిలయంగా సిద్దిపేటను తీర్చిదిద్దామని, సిద్దిపేటలో ఎల్ఎల్ బి కోర్స్, బీ ఫార్మసీ కోర్స్ వచ్చే ఏడాది నుండి ప్రారంభం అవుతాయని అన్నారు. ఒక్కప్పుడు పొట్టకూటి కోసం దుబారు పోయి బ్రతికితే , ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు కూలీ కోసం వలస వస్తున్నారని అన్నారు. అంబలి కేంద్రాల తెలంగాణ నుండి 8 ఎండ్లలో దక్షిణ భారత ధాన్యగారంగా తెలంగాణను మార్చుకున్నామని అన్నారు. తెలంగాణ అభివద్ధికి అంకితం అవుదామని అన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి నివాళులు
సిద్ధిపేట పాత బస్టాండు సర్కిల్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులు అర్పించారు. సెక్రటేరియట్‌కు అంబేద్కర్ నామకరణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీని ఆయన ప్రారంభించి, పాత బస్టాండ్ నుంచి మల్టీపర్పస్ హై స్కూల్ వరకు జాతీయ జెండా చేత పట్టుకొని వచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీస్ కమిషనర్ శ్వేత, మున్సిపల్ చైర్మన్ మంజుల, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ప్రజాప్రతినిధుల తదితరులు పాల్గొన్నారు.