Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుమతుల్లేకుండా నడుపుతున్న రత్నాకర్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ సీజ్
నవ తెలంగాణ-దుబ్బాక
సిద్దిపేట జిల్లా డీఎంఅండ్‌హెచ్‌ఓ డా.కాశీనాథ్ ఆదేశాల మేరకు శనివారం దుబ్బాక పురపాలిక కేంద్రంలోని పలు ఫస్ట్ ఎయిడ్ సెంటర్, ఆర్ఎంపీ, పీఎంపీ కేంద్రాలపై డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డా.శ్రీనివాస్, డీఐఓ విజయరాణి, డా.రజనీ, తిమ్మాపూర్ పీహెచ్సీ డా.భార్గవి బృందం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డా.శ్రీనివాస్ మాట్లాడుతూ దుబ్బాక పట్టణ కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ ప్రాక్టీషనర్ వద్దకు ట్రీట్మెంట్ కోసం వచ్చిన బాలికకు రక్తహీనతకు సంబంధించిన ఐరన్ సుక్రోజ్, మరో రెండు రకాల ఇంజక్షన్లను అధిక మోతాదులో 6 రోజులపాటు ఇవ్వడంతోనే ఆ బాలిక హార్ట్ ఎటాక్‌తో మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామన్నారు. బాలిక తల్లి వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకొని ఆ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ దామోదర్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు అందజేశామన్నారు.దుబ్బాకలో ఎం.రత్నాకర్ అనే ఓ ప్రైవేట్ ప్రాక్టీషనర్ శ్రీసత్య సాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పేరిట వైద్య సేవలు అందిస్తున్నాడని తెలిపారు. మరో బహుళ అంతస్తుల భవనంలో ఎలాంటి అర్హతలు, అనుమతులు లేకుండానే బెడ్లు ఏర్పాటు చేసి అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్స్, ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం, మరో షట్టర్లో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసి ఆపరేషన్లు, ఇతర వైద్య సేవలు అందిస్తున్నాడని చెప్పారు. దీనికి సంబంధించి రత్నాకర్ వద్ద ఎలాంటి అర్హతలు, అనుమతులు లేవని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా డీఎంఅండ్‌హెచ్‌ఓ డా.కాశీనాథ్ ఆదేశాల మేరకు రత్నాకర్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చి హాస్పిటల్‌ను సీజ్ చేశామని తెలిపారు. విచారణ నివేదికను డీఎంఅండ్‌హెచ్‌వోకు అందజేస్తామని చెప్పారు. సీజ్ చేయడం, నోటీసులు అందించడం కాకుండా వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు. జిల్లా వైద్య బృందం వెంట దుబ్బాక ఎస్ఐ బత్తుల మహేందర్ ఉన్నారు.