Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కదం తొక్కిన ఎర్రసేనాని
- ఎర్రజెండాల రెపరెపలు...భారీ ర్యాలీ
- ఐలమ్మ, కొమరయ్య స్ఫూర్తితో పోరాటాలు
- పొలంపల్లి, బైరాన్‌పల్లి, సంగారెడ్డిలో సీపీఐ(ఎం) సభలు
- సాయుధ పోరాట వారోత్సవాల సభలో తమ్మినేని, చుక్క రాములు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు ఉత్తేజాన్ని నింపేలా సాగాయి. నిజాం నిరంకుశ రాచరిక పాలన అంతమెందించిన పోరాట చరిత్రను నెమరేసుకుం టూ కమ్యూనిస్టు పార్టీలు సభలు, ఊరేగింపులు జరిపాయి. సాయుధ పోరాట వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జి ల్లాల్లో వారం రోజుల పాట తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించారు. బైరాన్‌పల్లి, సంగారెడ్డి, చే గుంట మండలం పొలంపల్లిలో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. బైరాన్‌పల్లిలో నిర్వహించిన సంస్మరణ సభలో అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ప్రజా పోరాటాల కు పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో శనివారం నిర్వహించిన ముగింపు సభలో మతోన్మాద బీజేపీ కాషాయ కుటిల రాజకీయాల్ని ఎండగడుతూ సకలశక్తుల ఐక్యతను కూడ గట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు పిలుపు నిచ్చారు. మెదక్ జిల్లా చేగొంట మండలంలోని కేవల్ కిషన్ స్తూపం వద్ద నిర్వహించిన సభలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి పాల్గొని సాయుధ పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు.
కదం తొక్కిన ఎర్రసేనాని
సంగారెడ్డి పట్టణంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సభ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా కార్మికులు, శ్రామికులు, మహిళలు, యువజనులు భారీగా తరలి వచ్చారు. చిట్యాల ఐలమ్మ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం పీఎస్ఆర్ గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎర్ర జెండా చేతబూనిన కార్యకర్తలు సాయుధ పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకుపోతామంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా సాగారు. ఎర్రజెండాలు రెపరెపలాడాయి. ప్రజానాట్య మండలి కళాకారులు డబ్బుల దరువులో ప్రదర్శన ముందు భాగాన నడిచారు. పార్టీ రాష్ట్ర కార్యదిర్శి వర్గ సభ్యులు చుక్క రాములు, జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, కార్యదర్శి వర్గ సభ్యులు బీరం మల్లేశం, రాజయ్య, మాణిక్యం, నర్సింహ్మరెడ్డి రామచందర్, సాయిలు జిల్లా కమిటీ సభ్యులు వహీద్ అలీ ప్రదర్శనకు నాయకత్వం వహించారు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య, వీరనారి చిట్యాల ఐలమ్మ, తొలి అమరుడు దొడ్డి కొమరయ్య, నిజాంకు వ్యతిరేకంగా కలం, గళం విప్పిన ముద్గుం మొయినొద్దీన్, సోయబుల్లాఖాన్, బందగీ ఫొటోలతో కూడిన ప్లకార్డులను చేతబూని ప్రదర్శనలో పాల్గొన్నారు. అమ రవీరుల త్యాగాలను స్మరిస్తూ... ఎర్రజెండా గొప్పదనాన్ని తెలియజేసే గీతాలను పీఎన్ఎం కళాకారులు ఆలపించారు. పటాన్చెరు, జహీరాబాద్, సంగారెడ్డి, ఆందోల్, నారాయణఖేడ్ ప్రాంతాల నుంచి సీపీఐ(ఎం) కార్యకర్తలు, ఎర్రజెండా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కేవల్ కిషన్ సమాధి వద్ద సభ
మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేగుంట మండలంలోని పొలంపల్లిలో ఉన్న కేవల్ కిషన్ సమాధి వద్ద శనివారం సభ నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీగా తరలి వచ్చి ర్యాలీ నిర్వహించారు. ఈ సభకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సాయుధ పోరాటంతో ఎలాంటి సంబంధంలేని బీజేపీ సర్దార్ వల్లబాయి పటేల్ పేరిట లబ్ధి పొంది మత విద్వేశాలు రగిల్చేందుకు కుట్ర చేస్తోందన్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన పోరాటం లేవనెత్తిన భూమి సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కె.మల్లేశం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.నర్సమ్మ, బి.బసవరాజు, కె.మల్లేశం, ఎ.మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
సాయుధ పోరులో బీజేపీ పాత్ర సున్నా : తమ్మినేని
సాయుధ రైతాంగ పోరాటంలో బీజేపీ, కాంగ్రెస్‌ల పాత్ర సున్నా అని, అయినా ఆ పార్టీలు ఎంతో ఆసక్తి చూపడం విడ్డూరంగా ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ పోరాటం గురించి మాట్లాడే అర్హత బీజేపీ, కాంగ్రెస్‌లకు లేదన్నారు. నిజాం లొంగిపోవడం అనే తంతు తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టుల ప్రాధాన్యతను తగ్గించడానికే అని అన్నారు. నిజాం కాలంలో వృత్తిదారులంతా వెట్టిచాకిరీ చేయడం, రైతులు పండించే పంటంతా కౌలు, పన్నుల కింద ఇవ్వడం, మహిళల్ని దొరలు చెరచడం పరిపాటిగా సాగే దురాఘతాలని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితిలో ఐలమ్మ కుల వృత్తి చేయకుండా ఆత్మాభిమానంతో కౌలు వ్యవసాయం చేయడం జీర్ణించుకోలేని దొరలు పంటను కాజేసేందుకు దాడులు చేశారని గుర్తు చేశారు. భీంరెడ్డి లాంటి నాయకులు అండగా నిలిచి దొరల్ని ఎదిరించి తిరగబడేందుకు ఊరేగింపుగా వెళ్తుంటే దొడ్డి కొమరయ్యను కాల్చి చంపారన్నారు. ఆ సందర్భంగా ప్రజలు సాయుధులై తుపాల్ని చేబట్టి పోరాడిన సంఘటలను గుర్తు చేశారు. ఆత్మాభిమానంతో బతికినా, భూమిపై హక్కు కోరినా తట్టుకోలేని భూస్వామ్య మనస్థత్వాన్ని అర్థం చేసుకోవాలన్నారు. పోరాటం నడిపిన కమ్యూనిస్టులకు తప్ప మరే పార్టీకీ సాయుధ పోరాటం గురించి మాట్లాడే అర్హతలేదన్నారు. బీజేపీ మత చిచ్చు రగిల్చి తెలంగాణ గడ్డపై బలపడాలని చూస్తోందన్నారు. మత రాజకీయాలు తప్ప ప్రధాని మోడీ దేశానికి చేసిందేమీ లేదన్నారు. పొద్దున లేస్తే మతం, గుళ్లు, మసీదుల గురించి తప్ప అధిక ధరలు, ప్రజల జీవన ప్రమాణాలు, పేదరికం, నిరుద్యోగం గురించి మాట్లాడే పరిస్థితి బీజేపీకి లేదన్నారు. మతోన్మాద బీజేపీని ఓడించకపోతే తెలంగాణ కూడా మతాల కక్షలతో అల్లాడిపోయే ప్రమాదముందన్నారు. అందుకే మునుగోడు ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నామన్నారు. కేసీఆర్ ప్రజా సమస్యల్ని పరిష్కరించకపోతే పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. దీన్ని అర్థం చేసుకోవడంలో గందరగోళానికి గురికావద్దని సూచించారు. జాతీయ స్థాయిలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా సలక శక్తులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరముందన్నారు. సంగారెడ్డి జిల్లాలో పార్టీ మరింత విస్తరించేందుకు సాయుధ పోరాట స్ఫూర్తితో పనిచేయాలని పిలుపు నిచ్చారు.