Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమ్యూనిస్టులే అసలు వారసులు
- తెలంగాణ విమోచన కాదు విలీన దినం
- చరిత్రను పాలకులు తప్పుదోవ పట్టించొద్దు
- కవల్కిషన్ ఆశయాలతో సీపీఐ(ఎం) పోరాటాలు
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం
నవతెలంగాణ-చేగుంట
తెలంగాణ సాయుధ పోరాటానికి అసలువారసులు కమ్యూనిస్టులే అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. పొలంపల్లిలోని కేవల్కిషన్ సమాధి దగ్గర సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం అధ్యక్షత శనివారం తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న వచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంతానికి మాత్రం 1951 సెప్టెంబర్ 17న వచ్చిందని అన్నారు. నాటి కాలంలో తెలంగాణ ప్రాంతాన్ని నిజాం, గడీల, దొరల పరిపాలనా కొనసాగిందన్నారు. దొరలు ఎక్కువ భూమిని కలిగి ఉంటే రెడ్డిలుగా కొనసాగారన్నారు. ఒక్కొక్క దొరకు లక్షల ఎకరాల భూమిని కలిగి ఉండి పేదలతో వెట్టిచాకిరీ చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విసుమురు రామచంద్రారెడ్డి దొరతనంతో ప్రజలందరి భూములను బలవంతంగా గుంజుకుని ఎక్కువ భూమిని సంపాధించారన్నారు. ముందు దొర భూమిలో పని చేసిన తర్వాతనే ప్రజలు తమ భూమిలో పనులు చేసుకునే పద్ధతి ఉండేదన్నారు. దొరలు పేదల భూమిపై, వారి ఆస్తులపై కన్నేసి కాజేశారన్నారు. దొరల, నిజాం ప్రభుత్వ శ్రమ దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేయడానికి కమ్యూనిస్టు నాయకులు ధైర్యాన్ని ఇచ్చి ముందు నిలిచారన్నారు. ప్రజలు చేసిన పోరాటాలకు నిజాం ప్రభువు తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేశారన్నారు. చరిత్రను పక్కదోవ పట్టించడానికి నేడు బీజేపీ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినంగా పాటించాలని ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. తెలంగాణ విలీనం దినం తప్ప విమోచన దినం కాదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తితో మెదక్ జిల్లాలో కమ్యూనిస్టు నాయకులు కేవల్కిషన్ మెదక్, చిన్నశంకరంపేట, వెల్దుర్తి, చేగుంట, మెదక్ చుట్టూ పక్కల మండలాల్లో భూమి కోసం, కూలి పెంపు కోసం, దొరల వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలను చైతన్యం చేశారన్నారు. ఆ రోజుల్లోనే తనకు తహసీల్దార్ ఉద్యోగం వచ్చినా వెళ్లకుండా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేశారన్నారు. గ్రామాలల్లోని చెరువుల్లో పూడిక తీయించి సాగునీరు అందించారన్నారు. భూస్వాములతో పోరాడి పేదలకు భూములు పంచారన్నారు. కేవల్కిషన్ ప్రజల కోసం చేస్తున్న పోరాటాలను సహించలేక భూస్వాములు కుట్ర చేసి అతన్ని హతమార్చాలని తెలిపారు. మాసాయిపేటలో ఎన్నికల్లో నామినేషన్ వేసి వస్తుండగా కాపు కాసి పొలంపల్లి దగ్గర లారీతో గుద్ది కేవల్కిషన్ను హత్య చేశారన్నారు. కేవల్కిషన్ స్ఫూర్తితో సీపీఎం పోరాటాలను తన భుజాన వేసుకుందన్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో కేవల్కిషన్ భననం నిర్మించుకుని పోరాట కేంద్రాలుగా కొనసాగిస్తున్నామన్నారు. సాయుధ పోరాటానికి కమ్యూనిస్టులే వారసులన్నారు. వీఆర్ఏల సమస్యలను తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించాలని సీపీఎం తీర్మానం చేసిందన్నారు. కార్యక్రమంలో సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యులు కె.నర్సమ్మ, కె.మల్లేశం, ఆ.మహేందర్ రెడ్డి, బస్వరాజ్, జిల్లా కమిటీ సభ్యులు నాగరాజు, సంతోష్, వాసు, నాగేందర్, సర్దార్, లక్ష్మీ నర్సయ్య, నాయకులు బాలమని, నరేందర్, పోచయ్య, శ్రీనివాస్, ప్రవీణ్, షౌకత్, మల్లయ్య, బాలయ్య పాల్గొన్నారు.