Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దసరా పండుగకు హైవే రహదారి పనులు ప్రారంభించాలి
- జిల్లా కలెక్టర్, సీపీ, అధికార వర్గాలతో మంత్రి హరీశ్ సమీక్ష
నవతెలంగాణ-సిద్దిపేట
ఎల్కతుర్తి నుంచి మెదక్ వరకూ నేషనల్ హైవే -765డీజీ నిర్మాణ పనులు, జనగామ-సిరిసిల్లా హైవే రహదారి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికార వర్గాలను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ శ్వేత, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి, నేషనల్ హైవే అథారిటీ డీఈ మోహన్, ఆర్డీఓ ఆనంతరెడ్డి, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులతో కలిసి ఎల్కతుర్తి-మెదక్ హైవే రహదారిపై మంత్రి సమీక్షా సమావేశం జరిపారు. హన్మకొండ, సిద్ధిపేట, మెదక్ జిల్లాల మీదుగా 137.6 కిలో మీటర్ల మేర సాగే ఈ హైవే నిర్మాణాన్ని రెండు ప్యాకేజీలుగా విభజించినట్లు, వీటిలో ఎల్కతుర్తి నుంచి సిద్ధిపేటకు 64 కిలో మీటర్లు రెండవ ప్యాకేజీగా, సిద్ధిపేట నుంచి మెదక్ వరకూ 69 కిలో మీటర్లు మొదటి ప్యాకేజీగా సిద్ధిపేట జిల్లాలో దాదాపు 80 కిలో మీటర్ల మేర నేషనల్ హైవే, అలాగే జనగామ జిల్లా నుంచి చేర్యాల, సిద్ధిపేట మీదుగా సిరిసిల్లా వరకూ సుమారు 105 కిలోమీటర్ల మేర నేషనల్ హైవేపై సాగుతున్న రహదారి నిర్మాణ అంశాలపై అధికార వర్గాలతో సుదీర్ఘంగా చర్చించారు. అక్టోబర్ నెల దసరా పండగ మొదటి వారంలో పనులు ప్రారంభం చేయాలని, యేడాదిన్నర కాలంలో పూర్తి చేయాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులను ఆదేశించారు.
పలుచోట్ల హైలెవల్, అండర్ పాస్-సబ్ వే బ్రిడ్జీల నిర్మాణం
బస్వాపూర్, పందిళ్ళ వద్ద పాత బ్రిడ్జీల స్థానంలో హైలెవల్ బ్రిడ్జీ నిర్మాణాలు, ఇవేగాక అవసరమైన చోట అండర్ పాస్ బ్రిడ్జీలతో పాటు 26 మైనర్ బ్రిడ్జీలు, 29 పైప్ కల్వర్టులు, రెండు బాక్సు కల్వర్టులు పునర్మించడంతో.. ఒక మైనర్ బ్రిడ్జీ, మేజర్ బ్రిడ్జీ, 2 పైప్ లైన్ కల్వర్టులు, 11 బాక్స్ కల్వర్టులు కొత్తగా నిర్మించనున్నట్లు నేషనల్ హైవే అథారిటీ అధికార వర్గాలు మంత్రి దష్టికి తెచ్చారు. ఆయా హై లెవల్, అండర్ పాస్-సబ్ వే బ్రిడ్జీ, ఈ రోడ్డు మీదుగా జంక్షన్ల అభివద్ధి పై 1 మేజర్ జంక్షన్ ఎల్కతుర్తి వద్ద, ఎల్కతుర్తి నుంచి సిద్ధిపేట వరకూ 28 చోట్ల మైనర్ జంక్షన్లు రానున్నాయని, ఇతరత్రా ప్రాజెక్టు అంశాలపై చర్చిస్తూ.. ఆయా శాఖలకు చెందిన అధికారుల సమన్వయంతో పనులకు ఆటంకాలు లేకుండా నిర్మాణ పనులు ముందుకు సాగాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. సమీక్షలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.