Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెచ్చులుడుతున్న గోడలు
- సరిగ్గా తలుపులు కిటిలు లేని తగతి గదులు
- వర్షం వస్తే జలమయమవుతున్న గదులు
నవతెలంగాణ-వర్గల్
విద్యార్థుల భవిష్యత్ తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని మేధావులు అంటారు. అలాంటి తరగతి గదులు సౌకర్యగా లేకపోతే విద్యార్థుల పరిస్థితి ఏమిటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుంది. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. వర్గల్ మండలంలోని మజీద్పల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది. ఈ పాఠశాలలో 120 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలో సరైన సౌకర్యాలు లేక చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. చెరువుకి దగ్గరగా ఉండడంతో వర్షాకాలంలో పాఠశాలలోకి నీరు వస్తోంది. పాఠశాలలోకి నీరు రావడంతో బురదగా మారి అపరిశుభ్రంగా మారడంతో విద్యార్థులు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు.
మరుగుదొడ్లు సరిగ్గా లేవు
పాఠశాలలో చదివే విద్యార్థులు ఒకటి, రెండు వచ్చినా ఇంటికే పరుగు పెట్టాలి. ఈ పాఠశాలలోని రెండు మరుగుదొడ్లు నిర్వహణ లేక, రిపేర్లు ఉండడం వల్ల వాటిని వినియోగించడం లేదు. మరుగుదొడ్లు వినియోగం లేనందున చిన్నారులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో స్కావెంజర్స్ లేకపోవడం వల్ల పాఠశాల అపరిశుభ్రంగా మారుతోంది. కొన్ని రోజులు ఉపాధి హామీలో భాగంగా తాత్కాలిక స్కావెంజర్స్ నియమించినప్పటికీ వేతనాలు సరైన సమయానికి రాకపోవడంతో రావడం లేదు. పాఠశాలను ఎవరూ శుభ్రం చేయకపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి.
పూర్తికాని గదుల నిర్మాణం
పాఠశాల ఆవరణలో రెండు గదుల నిర్మాణం ప్రారంభించి పది సంవత్సరాలు గడిచిన ఇంకా పూర్తికాలేదు. పాఠశాలలో వంటగది లేకపోవడంతో బడిలోని వరండాపై వంట చేస్తున్నారు. అక్కడ వంట చేయడంతో విద్యార్థులు పొగతో ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల పైకప్పు (స్లాబ్) పెచ్చులు ఊడడంతో వర్షం వస్తే వరండాలోకి నీరు ఉరుస్తుంది. వర్షం వచ్చినప్పుడు నీరు వరండాలోకి నీరు రావడంతో వంట చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు.
ధ్వంసమైన కిటికీలు, తలుపులు
పాఠశాల శిథిలావస్థకు చేరడంతో తరగతి గదులు, కిటికీలు, తలుపులు, ధ్వంసమయ్యాయి. వర్షం వస్తే కిటికీల ద్వారా వర్షపు నీరు తరగతి గదుల్లోకి వస్తోంది. తరగతి గదులకు సరైన తలుపులు లేకపోవడంతో అపరిశుభ్రంగా మారుతున్నాయి.
వానొస్తే తరగతి గదుల్లోకి నీళ్లొస్తున్నారు
వర్షం వస్తే మా తరగతి గదులు వర్షం నీటితో నిండుతున్నాయి. మా తరగతికి కిటికీలు, తలుపులు లేకపోవడంతో వర్షం వస్తే ఇబ్బందిగా ఉన్నది. వరండా పై వంట చేయడం వల్ల పొగతో ఇబ్బందులు పడుతున్నాం. మా పాఠశాలకు వచ్చే దారి బురదతో ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం.
- రమ్య, 5వ తరగతి విద్యార్థిని
బాత్రూమ్కి వెళ్లలేకపోతున్నాం
మా పాఠశాలలో బాత్రూమ్ సరిగ్గా లేదు. అపరిశుభ్రంగా ఉంటుంది. బాత్రూమ్ వెళ్లాలంటే ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. బాత్రూమ్స్ సరిగ్గా లేకపోవడంతో మేమందరం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎప్పటికైనా మా పాఠశాల బాత్రూమ్ని వినియోగంలోకి వచ్చేలా చూడాలి.
- బాలు, 5వ తరగతి విద్యార్థి