Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాళ్లబండి శశిధర్
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్
ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి రాళ్ళబండి శశిధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సంఘం జిల్లా కార్యాలయంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొంగరి వెంకట మావో అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి శశిధర్ మాట్లాడుతూ పేదలందరికీ నీడ కల్పిస్తామని ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు నిర్మించి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరి చేసి ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చి సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. పెరుగుతున్న ధరలతో కుటుంబాలను కూడా పోషించుకోలేని దుస్థితిలో ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలను ప్రభుత్వ నిర్ణయించడం లేదన్నారు. పేదలు ఇండ్ల కిరాయిలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారని వచ్చే కూలి ఇంటి కిరాయి కూడా సరిపోవడం లేదని తెలిపారు. ప్రభుత్వం దళితులకు పేదలకు వ్యవసాయ భూములు పంచుతామని చెప్పి ఇంతవరకు పంచలేదన్నారు. ఉపాధి హామీ పనిని 200 రోజులకు పెంచి కనీస కూలీ రూ.600 లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి చట్టాన్ని అమలు చేసి కూలీలను ఆదుకోవాలని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కేరళ ప్రభుత్వం తరహా 16 రకాల నిత్యావసర సరుకులు అందించాలన్నారు. ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వాలని, 120 గజాల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసి అర్హులైన పేదలకు ఇవ్వాలని, వైద్యం, విద్య పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతామని తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు గొర్రె శ్రీనివాస్, మేకల కృపాకర్, కొమురవెల్లి కనకయ్య, కిష్టయ్య బోయిని మల్లేశం, కనకయ్య, మల్కని ఎల్లయ్య, గుండ్ర రవీందర్ తదితరులు పాల్గొన్నారు.