Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేరిపోతుల జనార్దన్
నవతెలంగాణ-గజ్వేల్
స్వాతంత్య్ర సమరయోధుడు, విప్లవ వీరకిశోరం షాహిద్ భగత్ సింగ్ జయంతి, వర్ధంతులను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అధికారికంగా నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేరిపోతుల జనార్ధన్ డిమాండ్ చేశారు. శనివారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వాలే అధికారికంగా నిర్వహించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ అహ్మద్ హుస్సేన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ మాతృభూమి విముక్తి కోసం దేశ ప్రజల స్వేచ్ఛ కోసం బ్రిటిష్ పరిపాలనపై తిరుగుబాటు చేసి, నూనూగు మీసాల యుక్త వయసులో ఉరికంబాన్ని సైతం నవ్వుతూ ముద్దాడిన వీరకిశోరం షాహీద్ భగత్ సింగ్ అని ఆయన కొనియాడారు. ఆయన ధైర్య సాహసాలను, ఆయన పోరాట పటిమను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వున్నదని ఆయన అన్నారు. సెప్టెంబర్ 28న భగత్ సింగ్ 115 వ జయంతి ఉత్సవాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని, బ్రిటిష్ ముష్కరుల పాలన నుంచి భారత దేశ విముక్తి కోసం భగత్ సింగ్ చేసిన వీరోచిత పోరాటాలు పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. అదేవిధంగా భగత్ సింగ్‌కు భారతరత్న అవార్డు ప్రకటించాలని, భారత దేశ యువతకు ఆదర్శం అయిన భగత్ సింగ్ పేరు మీద యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సంగెం మధు, జిల్లా నాయకులు మిట్టపల్లి నవీన్, గజ్వేల్ నాయకులు డాకురి సంపత్, మాలవత్ సునీల్ నాయక్, కొడెం ప్రణరు, స్వభావత్ ప్రకాష్, శ్రీనులు పాల్గొన్నారు..