Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేని సర్వే నంబర్‌ను సృష్టించిన ధరణి పోర్టల్
- మా భూమి మరోకరికి రిజిస్ట్రేషన్ చేశారని పరుగుల మందు తాగిన మహిళా రైతు
- బాధితులు ఫిర్యాదు చేసినా యథేచ్ఛగా రిజిస్ట్రేషన్
- ప్రభుత్వ, వివాస్పద భూములకే అధికారుల రాజమార్గం
నవతెలంగాణ-బెజ్జంకి
'తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణీ లీలతో తరతరాలుగా సాగు చేసుకుంటున్న పట్టా భూమిని రెవెన్యూ అధికారులు మరొకరకి రిజిస్ట్రేషన్ చేశారు. మాకు న్యాయం చేయాలని తహసీల్దార్‌ను సంప్రదిస్తే నేనేమీ చేయలేనని చేతులెత్తేశారు. దీంతో మనస్థాపానికి గురైన మహిళా రైతు గాజె బాగ్యలక్ష్మి మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడటంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన మహిళ సహకోల్పోయి పడిపోవడంతో కుటుంబీకులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాచారం శివారులోని సర్వే నంబర్ 569/4బీలో 0.39 ఎకరాల భూమిని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కనగండ్ల లచ్చవ్వకు ప్రభుత్వ పంపిణీ చేసి పట్టా అందించింది. 568/2బీలో గాజె మల్లేశంకు 0.39 గుంటల భూమి పట్టాకలదు. ధరణి సృష్టించిన 568/3బీ సర్వే నంబర్‌ను ఆసరాగా చేసుకుని కనగండ్ల లక్ష్మి 568/2బీలో భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారి మ్యాకల నాగారాజుకు విక్రయించింది. భూ రికార్డులను పరిశీలించకుండా రియల్టర్ నాగారాజుకు రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ తతంగం పూర్తి చేశారు. తమ భూమిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేసి అన్యాయం చేశారని, తమకు న్యాయం చేయాలని పలుమార్లు తహసీల్దారుకు ఫిర్యాదు చేశామని బాధితులు అవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా రియల్టర్‌కు వత్తాసు పలికుతూ దాటవేసే దోరణిని అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా భూమిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేసి అన్యాయం చేస్తున్నారని, మీ తీరుతో పురుగుల మందు తాగి చనిపోతామని తహసీల్దార్‌ను వేడుకుంటే.. చస్తే చావండని, బెదిస్తున్నారా..? అని వ్యగ్యంగా తహసీల్దార్ బదులివ్వడంతో మనస్థాపానికి గురైన మహిళా రైతు బాగ్యలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. పైరవీలతో ప్రభుత్వ, వివాస్పద భూములకు రెవెన్యూ అధికారులు రాజమార్గం వేస్తున్నారని ఆరోపించారు.
తహసీల్దార్ అన్యాయం చేస్తున్నాడు
పలుమార్లు ఫిర్యాదు చేసిన తహసీల్దార్ పట్టించుకోకుండా మా భూమిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేశారు. మా భూమిని మరొకరికి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేశారో వివరాలం దించాలని ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసినా వివరాలందించడం లేదు. మా భూమిని రియల్టర్‌కు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
- గాజె మల్లేశం, దాచారం రైతు
ధరణితోనే సమస్యలు
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన భూముల వివరాలు ధరణిలో అందుబాటులో లేవు. కరీంనగర్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు పలుమార్లు వివరాలందించాలని కోరినా అందించలేదు. 568/3బీ సర్వే నంబర్లోని భూమిని నేను రిజిస్ట్రేషన్ చేయలేదు. రిజిస్ట్రేషన్ చేసిన సమయంలో నేను విధుల్లో లేను. నాయబ్ తహసీల్దార్ విధుల్లో ఉన్న సమయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. స్పష్టమైన భూ వివరాల్లేని రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలుపుదల చేయాలని సూచించాను. ధరణిలోని వివరాల ప్రకారమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తాం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసే విధానం మాత్రమే ధరణిలో అందుబాటులో ఉంది. రద్దు చేసే ప్రక్రియ లేదు.
- విజయ ప్రకాశ్ రావు, బెజ్జంకి తహసీల్దార్