Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం తరపున బంగారు కిరీటం, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన మంత్రి హరీశ్‌రావు
నవ తెలంగాణ-కొమురవెల్లి
కోరిన వారి కోర్కెలు తీర్చే కోర మీసాల కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మౌత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణ వేడుక ఆద్యంతం ఘనంగా నిర్వహించారు. మల్లన్న శరణు అంటూ జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది. కనులపండువగా జరిగిన మల్లన్న కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు బారులుతీరారు. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను మల్లన్న పెళ్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మల్లన్న కల్యాణోత్సవానికి బంగారు కిరీటం, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో స్వామివారి కల్యాణం జరిగింది.
అంతా శాస్త్ర ప్రకారమే
మూడు నెలల పాటు జరిగే బ్రహ్మౌత్సవాలు మల్లన్న కల్యాణంతో ప్రారంభమయ్యాయి. యేటా మార్గశిర మాసం చివరి ఆదివారం స్వామివారి కల్యాణం జరగడం ఆనవాయితీగా వస్తున్నది. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం కల్యాణ మహౌత్సవం జరిగింది. వధువుల తరఫున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా.. వరుడి తరఫున పడిగన్నగారి వంశస్థులు కన్యాదానం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కొమురవెళ్లి మల్లన్న మన కొంగు బంగారమన్నారు. రాష్ట్రానికే తలమానికం మల్లన్న జాతర అని చెప్పారు. ఇవాళ మల్లన్న స్వామివారి కల్యాణం వైభవంగా జరగడం స్వామివారికి బంగారు కిరీట ధారణ చేయడం సంతోషంగా ఉన్నదని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాలకు నిధులు మంజూరు చేస్తూ పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తెస్తున్నారని మంత్రి వెల్లడించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కొమురవెళ్లి మల్లన్న స్వామి కల్యాణం వైభవంగా జరిగిందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొమురవెళ్లి మల్లన్న ఆలయ అభివృద్ధికి రూ.30 కోట్లు కేటాయించారన్నారు. వచ్చే యేట మల్లన్న స్వామి కల్యాణం వరకు కేతమ్మ, మేడమ్మల అమ్మవార్లకు ఒక కిలో స్వర్ణ కిరీటం తయారు చేయిస్తామని హామీ ఇచ్చారు. రూ.1100 కోట్లతో యాదాద్రి నిర్మాణం జరిగిందన్నారు. కొండగట్టు అంజన్న ఆలయానికి రూ.100 కోట్లు కేటాయించామని తెలిపారు. కొందరు ఎన్ని కుట్రలు చేసినా మల్లన్న దయతో మల్లన్నసాగర్ అనుకున్న సమయానికి పూర్తి చేసుకున్నామని తెలిపారు. మల్లన్న దయతో మూడేళ్లలో మల్లన్న సాగర్ పూర్తి చేసుకుని పలు జిల్లాలకు సాగునీటితో సస్యశ్యామలం చేయడం జరుగుతున్నదని చెప్పారు. మల్లన్న సాగర్ ప్రారంభం చేసి గోదావరి జలలతో సీఎం కేసీఆర్ మల్లన్న పాదాలు కడిగి మొక్కులు తీర్చుకున్నారని గుర్తు చేశారు. రూ.11 కోట్లతో భక్తులకు కావాల్సిన క్యూలైన్లు, 50 గదులతో సత్రం, కోనేరు, దేవాలయం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వేడుకల్లో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జనగామ శాసన సభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, రాష్ట్ర వైద్య సేవలు, మౌళిక సదుపాయ అభివద్ది సంస్థ చైర్మన్ శ్రీఎర్రోల్ల శ్రీనివాస్, రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.