Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి
నవ తెలంగాణ-సిద్దిపేట
'మేం కార్మికులకు అండగా ఉంటున్నాం. వారి పక్షమే మా నడక. కార్మికుల సమస్యల పరిష్కారమే మా లక్ష్యం' అని సీఐటీయూ సిద్దిపేట జిల్లా కార్యదర్శి గోపాలస్వామి తెలిపారు. ఈ నెల 21, 22, 23వ తేదీల్లో జరిగే సీఐటీయూ రాష్ట్ర మహాసభల సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాలస్వామితో నవ తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ..
జిల్లాలో సీఐటీయూ ఉద్యమాలు ఏ విధంగా ఉన్నాయి
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ జిల్లాలో అనేక ఉద్యమాలను చేపట్టింది. ప్రభుత్వ పథకాలలో పనిచేసిన స్కీం వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం, అసంఘటిత రంగ కార్మికులైన హమాలీ, భవన నిర్మాణ, ఆటో, బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, గజ్వేల్ ప్రాంతంలోని పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలను, ధర్నాలను, సమ్మేలను చేపట్టాం. భవన నిర్మాణ రంగాల కార్మికులకు అండగా ఉంటున్నాం.
ఏ రంగాలలో కేంద్రీకరించి పనులు చేస్తున్నారు
అసంఘటిత రంగ కార్మికులైన హమాలీ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. కూలి రేట్లు పెంచాలని ఆందోళన నిర్వహించాం. బీడీ కార్మికులకు కనీస వేతన జీవో అమలు చేయాలి. కేంద్రం వసూలు చేస్తున్న సెస్ డబ్బులను ఖర్చు చేయాలి. కార్మికుల సంక్షేమ కోసం సిద్దిపేటలో ఈఎస్ఐ ఆసుత్రిని ఏర్పాటు చేయాలి. వారి పిల్లలకు స్కాలర్షిప్లను ఇవ్వాలి. గతంలో ఇచ్చిన మాదిరిగా ఇంటి నిర్మాణం కోసం హౌసింగ్ లోన్ ఇవ్వాలని ఆందోళన నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికులను గాలికి వదిలేయడంతో వారి పరిస్థితి దీపంలా మారింది. భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు నుంచి డబ్బు ఖర్చు చేయాలి. అవి ఖర్చు కాకుండా దుర్వినియోగం అవుతున్నాయి. భవన నిర్మాణ కార్మికులకు బోర్డు నుండే రూ.6 వేల పింఛన్ ఇవ్వాలని ఆందోళన చేశాం. 73 షెడ్యూల్స్లలో పనిచేస్తున్న పారిశ్రామిక కార్మికులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వారి వేతనాల జీవోలను సవరిం చలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వారి వేతనాల సవరణ జీవోలు విడుదల కాలేదు. దీంతో కార్మికుల పనిగంటలు పెరిగాయి. వేతనాలు మాత్రం పెరగలేదు. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగా యి. కార్మికుల వేతనాలు పెరగకపోవడంతో ఆర్థికంగా ఇబ్బం దులు పాలవుతున్నారు. చలో హైదరాబాదు లాంటి కార్యక్ర మాలు చేపట్టాం. ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించాం.
స్కీం వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏమిటి?
స్కీంవర్కర్స్ అయిన అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఈజీఎస్, ఐకేపీ, మెప్మా ఇలా వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం అమలు కావడం లేదు, గౌరవ వేతనమే ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. కనీస వేతనం రూ.26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌తో ప్రభుత్వ దృష్టికి వివిధ రూపాలలో తీసుకువచ్చాం. స్కీంవర్కర్లతో బానిసలుగా పని చేయించుకుంటున్నారు. వారికి కనీస వేతనాలతో పాటు వర్క్చాట్ను తయారు చేయాలి. వర్క్‌లోడ్ తగ్గించాలి. ఒక్కోసారి వర్క్ లోడ్‌తో స్కీం వర్కర్లు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలున్నాయి. కార్మికులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాలలో పని చేస్తున్న వారికి కనీస వేతనం ఇవ్వాలి. ఎనిమిది గంటల పనిని అమలు చేయాలి. ప్రజల ఆరోగ్యం కోసం పని చేసే కార్మికుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం పట్టించుకోవడంలేదు, ప్రమాదవశాత్తు మరణిస్తే నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదు, వారికి నష్టపరిహారం అందించాలి. సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలలో పెద్దపెద్ద షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. షాపింగ్ మాళ్లలో 10 నుంచి 12 గంటల పాటు ఎలాంటి రెస్ట్ ఇవ్వకుండా కార్మికులతో పని చేయించుకుంటున్నారు. అనుకో కుండా ఒకరోజు లీవ్ పెట్టిన వారిని ఉద్యోగం నుంచి తీసివేశారు. వీరందరికీ అండగా ఉంటూ ఉద్యమాలు చేపడుతున్నాం.
జిల్లాలో ఎంతమంది కార్మికులు పని చేస్తున్నారు?
సిద్దిపేట జిల్లాలో డీఎక్స్ఎన్, ఆర్చి ఫార్మా లాంటి పెద్ద పరిశ్రమ లు, ఇతర పరిశ్రమలు ఉన్నా యి. ఇందులో సుమారుగా 26,000 మంది కార్మికులు పర్మినెంట్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నారు. బీడీ రంగంలో సుమారు 70 వేల మంది, భవన నిర్మాణ రంగంలో సుమారు 35 వేల మంది, హమాలీ రంగంలో సుమారు 30 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు.
సీఐటీయూ రాష్ట్ర మహాసభల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి
సీఐటీయూ రాష్ట్ర 4వ మహాసభలు సిద్దిపేటలో ఘనంగా నిర్వహిస్తున్నాం. మహాసభలను విజయవంతం చేయడానికి అన్ని రంగాల కార్మికులతో ఐక్యంగా పని చేస్తున్నాం. జిల్లాలోని అన్ని మండలాలు, ప్రతి గ్రామం, పట్టణంలో అన్ని రంగాల కార్మికులతో అడ్డా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రధాన రహదారుల వెంబడి గోడలకు రాతలు రాయించాం. రెండు రకాల పోస్టర్లను ముద్రించి అన్ని గ్రామాలలో అతికించాం. పట్టణాలలో కూడా గోడ రాతలు రాయించాం. వివిధ కూడళ్ల వద్ద జెండాలను ఏర్పాటు చేశాం. పెద్ద బ్యానర్లను ఏర్పాటు చేసి ముస్తాబ్ చేస్తున్నాం. 23న పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సభకు కేరళ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శివన్ కుట్టి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. సీఐటీయూ ఆల్ ఇండియా అధ్యక్షురాలు హేమలత కూడా హాజరవుతారు. మహాసభకు వచ్చే ప్రతినిధులకు వసతి, భోజనాలు తదితర అన్ని ఏర్పాట్లు చేశాం.
మీ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి?
సిద్దిపేట పరిసర ప్రాంతాలలో రైస్‌మిల్స్, చిన్న పరిశ్రమలు, ఆయిల్మిల్స్, సిరామిక పరిశ్రమలు, సామెల్స్ ఇలా పాత పరిశ్రమలతో పాటు డీఎక్స్ఎన్ లాంటి పరిశ్రమలలో పని చేస్తున్న కార్మికుల సమస్యల కోసం కొత్త రూపాలలో పోరాటం చేయడానికి మహాసభలలో చర్చిస్తాం.
కొత్తగా షాపింగ్ మాల్, ఆస్పత్రులలో పని చేస్తున్న కార్మికుల సమస్యలపై కేంద్రీకరిస్తాం. హమాలీ, భవన నిర్మాణ, బీడీ, ట్రాన్స్ పోర్ట్ రంగాలలో పని చేస్తున్న కార్మికుల వేతనాలు, హక్కుల, సంక్షేమం కోసం పనిచేస్తాం. గజ్వేల్ ప్రాంతంలో ఉన్న 105 పరిశ్రమలలోని కార్మికుల వేతనాలు కోసం ఉద్యమాలు చేస్తాం. జిల్లాలోని అన్ని రంగాలలో సీఐటీయూను విస్తతంగా తీసుకువెళ్లి వారి సమస్యల పరిష్కారం కోసం పని చేస్తాం.