Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తూప్రాన్ ఎస్సై సురేష్ కుమార్
నవతెలంగాణ-తూప్రాన్ రూరల్/మనోహరాబాద్
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనాల డ్రైవర్లు తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని తూప్రాన్ ఎస్సై సురేష్ కుమార్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్, తూప్రాన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తూప్రాన్ టోల్ ప్లాజా సమీపంలో జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్, తూప్రాన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి, సికింద్రాబాద్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూప్రాన్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ సురేష్ కుమార్ ముఖ్య అతిధిగా విచ్చేసి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా తూప్రాన్ ఎస్.ఐ సురేష్ కుమార్ మాట్లాడుతూ వాహనదారుల కంటి చూపు సరిగా లేకపోవడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. కావున ప్రతి వాహనదారుడు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జీఎంఆర్ పోచంపల్లి హైవేస్ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటరమణ మాట్లాడుతూ అవగాహన లోపం కారణంగా చాలా మంది డ్రైవర్లు సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవడం విస్మరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఎస్.ఐ సురేశ్ కుమార్, పోలీస్ సిబ్బంది, జీఎంఆర్ పోచంపల్లి హైవేస్ సిబ్బంది నాగేశ్వరరావు, ప్రవీణ్ కుమార్, నారాయణన్ , పుష్పగిరి కంటి ఆసుపత్రి కోఆర్డినేటర్ వేణు ప్రసాద్, సిబ్బంది, ఫౌండేషన్ ఇంచార్జ్ శ్రీనివాస్, వాహనదారులు పాల్గొన్నారు.