Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
నవతెలంగాణ-సంగారెడ్డి
జిల్లాలో ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని యాక్షన్ ప్లాన్ మేరకు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి 13వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకల నిర్వహణపై స్వీప్ నోడల్ అధికారి, ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఎమ్మెన్నార్ మెడికల్ కళాశాల, తారా డిగ్రీ కళాశాల, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, రెవిన్యూ డివిజనల్ అధికారులు, ఏఈఆర్ఓలతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.ప్రస్తుతం 13వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జరుపుకోనున్నట్లు తెలిపారు. జాతీయ ఓటర్ దినోత్సవం లో భాగంగా నిర్వహించు వివిధ కార్యక్రమాలను కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నిర్వహించాలని సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవం పై విస్తత ప్రచారం జరగాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జిల్లా స్థాయి, ఈ ఆర్వో, ఏఈఆర్ఓ స్థాయి లో, అదేవిధంగా ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో బూత్ లెవెల్ అధికారులు నిర్వహించాలన్నారు. కొత్తగా నమోదైన ఓటర్లను సన్మానించి వారికి (ఎపిక్ కార్డ్) ఓటరు కార్డు అందజేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్వీప్ నోడల్ అధికారి సురేష్ మోహన్,జిల్లా అధికారులు, రెవిన్యూ డివిజన్ అధికారి నగేష్, ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కళాశాలల ప్రిన్సిపల్స్, తారా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవిందరామ్, ఏ ఈ ఆర్ ఓ లు, కలెక్టరేట్ ఏవో మహిపాల్ రెడ్డి, ఎన్నికల విభాగపు సూపరిండెంట్ తిరుమల రావు, తదితరులు పాల్గొన్నారు.