Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరుకానున్న మంత్రి, ఎమ్మెల్సీ 1500మంది విద్యార్థుల హాజరు
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్
సరస్వతి విద్యాపీఠం తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి విద్యారణ్య ఆవాస విద్యాలయంలో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు సరస్వతి విద్యాపీఠం ముఖ్యులు తెలిపారు. తడకపల్లి విద్యారణ్య ఆవాస విద్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యాపీఠం ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలలో భాగంగా ఈ సారి సిద్దిపేటలో విద్యారణ్య ఆవాస విద్యాలయంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి సరస్వతి విద్యాపీఠానికి సంబంధించిన విద్యాలయాల నుంచి సుమారు 1500 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక మంత్రితో చర్చించి సిద్దిపేటలోని టీటీసీ భవన్ పొన్నాలలోని తెలంగాణ భవన్ పట్టణంలోని విపంచి కళానిలయంలో విద్యార్థులు ఉండడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ నెల 20, 21, 22 తేదీలలో తడకపల్లి ఆవాస విద్యాలయంలోనే కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, క్యారం, చెస్, టగ్ ఆఫ్ వార్, వాలీబాల్, టెన్నికాయిట్, యోగ సన్ వంటి పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. వ్యక్తిగత పోటీలలో భాగంగా పరుగు పందాలు, రిలే పరుగు, జావలిన్ త్రో, షాట్ పుట్, డిస్కస్, హామర్, లాంగ్ జంప్, హై జంప్, త్రిబుల్ జంప్ వంటి క్రీడలను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడా పోటీల ప్రారంభానికి స్థానిక మంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్సీ కూర రగోతంరెడ్డి, జడ్పీ చైర్మన్ రోజా శర్మ స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు. క్రీడలను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సరస్వతి విద్యాపీఠం జిల్లా అధ్యక్షులు తడకమడ్ల ఈశ్వరయ్య ఇతరులు కొమురవెల్లి శేఖరం, కాటం రవీందర్, ఉప్పల భూపతి, వీరారెడ్డి, వైకుంఠం, లింగమూర్తి, నారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.