Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో జారీకి ప్రభుత్వం కసరత్తు
- అప్పటి వరకు ఆమోదించొద్దంటూ కలెక్టర్లకు ఆదేశాలు
- బుజ్జగింపులతో చల్లబర్చే ప్రయత్నాలు
- కలెక్టర్ ఎదుట 50 శాతం కంటే ఎక్కువ సభ్యులు సంతకాలు పెట్టాల్సిందే
- సంగారెడ్డి, అందోల్-జోగిపేట అవిశ్వాలు పక్కన పెట్టిన అధికారులు
- నేడు కలెక్టర్‌ను కలిసేందుకు కౌన్సిలర్ల ప్రయత్నం
- ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్స్‌లో అసమ్మతి తలనొప్పులు
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు పెట్టే తంతు ఓ పక్క సాగుతుండగా వాటికిి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం మరో పక్క ప్రయత్నాలు చేస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను అధికార పార్టీనే కైవసం చేసుకుంది. మూడేళ్ల తర్వాత రెండు గ్రూపులుగా చీలిన కౌన్సిలర్లు పార్టీకి తలనొప్పులు తెస్తున్నందున... వాటికి చెక్ పెట్టేందుకు అవిశ్వాసం పెట్టే గడువును పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. గడువు పెంచి అసమ్మతి సెగలపై నీళ్లు చల్లాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారు.
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
అధికార పార్టీ అంతా బాగుందనుకున్న వేళ స్థానిక సంస్థల్లో అసమ్మతి సెగలు రగిలాయి. బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లను దించి తాము కూర్చోవాలనుకున్న వాళ్లు మెజార్టీ సభ్యుల్ని కూడేసుకుని వేరు కుంప్పట్లు పెడుతున్నారు. సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్వంత జిల్లా సిద్దిపేట సిగలోనే చేర్యాల చైర్మన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రకటించారు. ముందస్తు ఒప్పందం మేరకు చైర్మన్ పదవిని ఫిప్టీ ఫిప్టీ అనుకున్నారు. రెండున్నరేళ్లు పూర్తయినా చైర్మన్ పదవి వదులుకోవట్లేదని అధికార పార్టీకి చెందిన వాళ్లే తిరుగుబాటు చేశారు. 12 మంది కౌన్సిలర్లకుగాను టీఆర్ఎస్-5, కాంగ్రెస్-5 స్వతంత్రులిద్దరు గెలిచారు. స్వతంత్రుల మద్దతుతో చైర్మన్ అయిన స్వరూపరాణి మూడేళైనా పదవి దిగలేదంటూ ఇండిపెండెంట్‌గా గెలిచి టీఆర్ఎస్లో చేరి మద్దతిచ్చిన జుబేదాఖాతూం తిరుగుబాటు చేసి 11 మందితో కలిసి అవిశ్వాసం ప్రకటించారు. చైర్మన్ నిర్వహించిన సమావేశానికి వీరెవ్వరూ హాజరుకాలేదు. సంగారెడ్డి చైర్పర్సన్ బొంగు విజయలక్ష్మీరవి, వైస్ చైర్మన్ లతావిజేందర్రెడ్డి ఒంటెత్తు పోకడలు పోతున్నారంటూ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు 23 మంది 7వ వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మీశేఖర్ నాయకత్వంలో అవిశ్వాసం ప్రకటించారు. అందోల్-జోగిపేట మున్పిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టారు. సంగారెడ్డి, అందోల్-జోగిపేట చైర్మన్, వైస్ చైర్మన్లను దించి తామెక్కాలని ఆశపడ్డ కౌన్సిలర్లు వేర్వేరుగా కలెక్టరేట్లో అవిశ్వాస పత్రాలను అందజేశారు. సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ పి.జయమ్మను దించాలని అసమ్మతి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. వీటితో పాటు నర్సాపూర్ చైర్మన్ మురళీధర్ యాదవ్ బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయన చైర్మన్ పదవికి రాజీనామా చేయలేదు. అక్కడ బీఆర్ఎస్ చైర్మన్ కావాలంటే అవిశ్వాసం పెట్టాలి. ఒక్కదానికి కోసం మిగతా మున్సిపాలిటీలో కంపు పెట్టే అవకాశం ఇచ్చినట్లు అవ్వుదని వదిలేశారు. సంగారెడ్డిలో 8 మున్సిపాలిటీలు, మెదక్‌లో 4, సిద్దిపేట 5 మున్సిపాలిటీల్లోనూ అసమ్మతి సెగలు రగిలే ప్రమాదముంది. అవిశ్వాసం పెట్టే గడువు పెంచే ఛాన్స్ ఉన్నందున ప్రస్తుత చైర్మన్, వైస్ చైర్మన్స్ తమ పదవులకు ఢోకాలేదంటూ ధీమాగా ఉన్నారు.
అవిశ్వాస గడువు 4 ఏళ్లకు పెంచే ఛాన్స్
మున్సిపల్ చైర్మన్ పదవుల కోసం పార్టీలోనే చీలికలు రావడం మంచిదిగాదని భావిస్తున్న బీఆర్ఎస్ బాస్ అవిశ్వాస తీర్మానం పెట్టే గడువును పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 4 ఏళ్ల పదవి కాలం ముగిసిన తర్వాతే అవిశ్వాసాలకు అవకాశం ఉండేలా చట్టం తీసుకురానున్నట్లు చెబుతున్నారు. శాసన సభా సమావేశాల సందర్భగానే ఈ జీవో రావచ్చంటున్నారు. ఏడాది పాటు గడువు పెంచితే ఇంతలోపు అసెంబ్లీ ఎన్నికలు ముగిసే అవకాశముంది. మళ్లీ అధికారంలోకి వస్తే అవిశ్వాసాల వల్ల సమస్య ఏమీ ఉండదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే గడువు పెంచే విషయం గురించి మంత్రి కేటీఆర్, హరీశ్‌రావు ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులకు సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. అప్పటి వరకు అసమ్మతి గ్రూపును బుజ్జగించాలని జిల్లా నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. సంగారెడ్డిలో చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్ అనారోగ్య సమస్యతో అందుబాటులో లేరు. అందోల్-జోగిపేట ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇతర నాయకుల్ని రంగంలోకి దించి బేరసారాలాడి అసమ్మతి కౌన్సిలర్లను శాంతింపజేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.
నేడు కలెక్టర్‌ను కలువనున్న అసమ్మతి గ్రూపు
సంగారెడ్డిలో 23 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసిన అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్‌కు ఇవ్వాలని చూశారు. కలెక్టర్ శరత్ అందుబాటులో లేకపోయే సరికి ఏ వోకు ఇచ్చారు. అందోల్-జోగిపేట అసమ్మతి కౌన్సిలర్లు కూడా అవిశ్వాస తీర్మా నంతో కలెక్టర్‌కు వచ్చి అదనపు కలెక్టర్ వీరారెడ్డికి ఇచ్చారు. రెండు మున్సిపా లిటీలకు చెందిన కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస పత్రాలకు ఎలాంటి చట్టబద్ధతలేదు. ఎందుకంటే మున్సిపాలిటీలో మొత్తం సభ్యుల్లో 50 శాతం కంటే ఎక్కువ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ ఎదుట హాజరై సంతకాలు చేసిన అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్‌కు అందజేస్తేనే చట్టబద్ధత అవుతుంది. సంగారెడ్డి, అందోల్-జోగిపేట అవిశ్వాసాలు అలా జరగనందున వాటిని పక్కన పడేశారు. సోమవారం కలెక్టర్ అందుబాటులో ఉండనున్నందున స్వయంగా కలిసి సంతకాలు చేయాలని రెండు అసమ్మతి గ్రూపులు ప్రయత్నిస్తున్నాయి. సంగారెడ్డి అసమ్మతి కౌన్సిలర్లు క్యాంపుకెళ్లాల్సి ఉన్నా కలెక్టర్‌ను కలిసేందుకు వాయిదా వేసుకున్నారు. కలెక్టర్ శరత్ తీసుకునే నిర్ణయం బట్టి అసమ్మతి గ్రూపు భవితవ్యం తేలనుంది.